లంక విజయాలకి కరుణించిన కరోనా.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న శ్రీలంక
* రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన భారత్ * 81 పరుగులకే బ్యాట్ ఎత్తేసిన యువ ఆటగాళ్లు
India vs Sri Lanka T20: క్రునాల్ పాండ్య కరోనా పుణ్యమా అని టీం ఇండియా జట్టులోని పలువురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెస్ట్ లో ఉండటంతో బెంచ్ కి అంకితమైన పలువురి ఆటగాళ్ళకు అవకాశం రావడం ఆ ఆటగాళ్ళు సరిగ్గా రాణించకపోవడంతో చివరి రెండు టీ 20 లలో భారత్ పరాజయం పాలయ్యి సిరీస్ కోల్పోయింది. గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయంతో టీ20 సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. వరుస సిరీస్ ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకి నూతనోత్సాహం వచ్చినట్లయ్యింది.
భారత్‌తో జరిగిన మూడో టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంతకుముందు ఆడిన ఐదు టీ20 సిరీసుల్లో ఆ జట్టు వరుసగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువ భారత్‌తో ఆడిన మూడో టీ20లో సునాయాస విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసి పొట్టి క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.