SRH Shreevasts Goswami: సన్‌రైజర్స్ క్రికెటర్ పెద్ద మనసు.. ఆక్సిజన్ సరఫరాకు..
SRH Shreevasts Goswami: కరోనా కట్టడికి ఇండియా సాగిస్తున్న పోరులో భాగంగా సన్ రైజర్స్ ఆటగాడు తన వంతు సాయాన్ని అందించాడు.
SRH Shreevasts Goswami: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలోని ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. చాలా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభించక కరోనా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వీలైనంతలో వాళ్లు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. ప్రజలు, అభిమానులకు ఆపద ఎప్పుడు ఎదురైనా.. ముందుండే క్రికెటర్లు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవత్స్ గోస్వామి పెద్ద మనసు చాటుకున్నాడు.
కరోనా మహమ్మారి కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా 31 ఏళ్ల శ్రీవత్స్ గోస్వామి తన వంతు సాయం చేశాడు. ఆక్సిజన్ సరఫరాకు రూ. 90 వేలు విరాళం ఇచ్చి.. తన పెద్ద మనసును చాటుకున్నాడు ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్ శ్రీవత్స్ గోస్వామి. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే ఛారిటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అత్యవసర సమయంలో సాయం చేసినందుకు గోస్వామికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి స్పందించిన శ్రీవత్స్.. కష్ట సమయంలో అందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని.. ప్రజలను సాయం చేయమని కోరాడు.
ఇదిలా ఉంటే ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ 1 బిట్ కాయిన్ ను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలను అందించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా సెకండ్ వేవ్ తో ఇండియా అల్లాడిపోతున్న వేళ సాయం చేసేందుకు ముందుకొచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి కావడంతో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రీవత్స్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే.