Ind vs Aus Test: రోహిత్‌తో సహా ఐసోలేషన్‌కు ఐదుగురు టీమిండియా క్రికెటర్లు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఆటగాళ్లు బయోబబుల్ రూల్స్ బ్రేక్ చేశారని.. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు. నిజంగా వాళ్లు నిబంధనలు అతిక్రమించారా.. అసలేం జరిగింది ? అదే నిజం అయితే ఇప్పుడేం జరగబోతుంది ?
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్‌మెంట్ ఐసోలేషన్‌లో ఉంచింది. ఈ ఐదుగురు ఆటగాళ్లు న్యూ ఇయర్ సందర్భంగా మెల్‌బోర్న్ నగరంలోని ఓ ఇండోర్ రెస్టారెంటులో డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా ! దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీరిని జట్టులోని ఇతర సభ్యులకు దూరంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.
ఐదుగురు ఆటగాళ్లు రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అభిమాని.. వాళ్లకు తెలియకుండా వారి బిల్ పే చేశాడు. ఆ తర్వాత వీళ్లు డబ్బులు తిరిగి ఇద్దామని ప్రయత్నిస్తే.. ఆ ఫ్యాన్ ఒప్పుకోలేదు. ఐతే పంత్ మాత్రం అతన్ని హగ్ చేసుకున్నాడని... ఇది బయో బబుల్ రూల్స్ క్రాస్ చేయడమే అని.. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీనికి సంబంధించి బీసీసీఐకి కూడా సమాచారం అందించామని వివరించింది.
ప్రయాణాల్లోనూ, ప్రాక్టీస్ టైమ్‌లోనూ ఈ ఐదుగురు రెండు జట్లకు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ విచారణకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. నిజంగా అభిమానిని పంత్ హత్తుకున్నాడని తేలితే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఐతే ఆ ఫ్యాన్ మాత్రం అలాంటిదేమీ జరగలేదని.. తానే ఎమోషనల్ అయి అలా చెప్పాలనని అంటున్నాడు. ఇక అటు రెస్టారెంట్ ముందు మాస్కులు ధరించలేదని... బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేశారని ఆస్ట్రేలియా మీడియాలో వస్తున్న కథనాలను బీసీసీఐ ఖండించింది. నిబంధనల ప్రకారం అనుమతించిన రెస్టారెంట్‌కే వాళ్లు వెళ్లారని..బయోబబుల్‌లోనే ఉన్నారని చెప్తోంది.