Punjab Kings: గువాహటిలో పంజావిసిరిన పంజాబ్ కింగ్స్

Punjab Kings: రాజస్థాన్ రాయల్స్‌పై విజయ బావుటా

Update: 2023-04-06 02:26 GMT

Punjab Kings: గువాహటిలో పంజావిసిరిన పంజాబ్ కింగ్స్

Punjab Kings: గువాహటి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగువికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టన్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఆటతీరుతో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో టాప్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. 56 బంతుల్లో 9 బౌండరీలు, 3 సిక్సర్లతో 86 పరుగులు అందించి, అజేయంగా నిలిచాడు. మరో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ప్రభ్ సిమ్రాన్ 34 బంతుల్లో 7 బౌండరీలు, మూడు సిక్సర్లతో 60 పరుగులు అందించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ 27 పరుగులు చేశారు.

198 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడును ప్రదర్శించింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించాడు. కొద్దిసేపటికే పెవీలియన్ బాటపట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. జోస్ బట్లర్ ఓ బౌండరీ, మరో సిక్సర్ ఊపు తెప్పించిన బట్లర్ 19 పరుగులకే బౌలర్‌కే క్యాచ్‌ఇచ్చి వెనుదిరిగాడు.

కెప్టన్ సంజూ శాంమ్సన్ బ్యాటును ఝుళిపించడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. ఐదు బౌండరీలు, ఒక సిక్సర్ తో 42 పరుగులను అందించాడు. దేవదత్ పడికల్ 21 పరుగులు, రియాన్ పరాగ్ 20 పరుగులు అందించారు. క్రీజులో కుదురుకున్న హెట్మియర్, ద్రువ్ జురెల్ చక్కటి భాగస్వామ్యంతో విజయలక్ష్యాన్ని అధిగమించే ప్రయత్నం చేశారు.

ఆఖరి ఓవరుదాకా గెలుపు సాధన దిశగా సాగించిన ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. ఆఖరి ఓవర్లో 16 పరుగులు సాధించాల్సి ఉండగా 10 పరుగులు మాత్రమే రాబట్టుకోగలిగారు. శాం కరణ్ బౌలింగ్‌లో మూడో బంతికి హెట్మియర్ రనౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ విజయానికి మార్గం సుగమమైంది. ఐదు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయపతాకాన్ని రెపరెపలాడించింది.

ఈ సీజన్లో వరుసగా రెండో విజయం సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి జట్లకు... గట్టి హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్ నాథన్ ఎలిస్‌ నాలుగు వికెట్ల ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

Tags:    

Similar News