Paris Olympics 2024: భారత్ కు మరో పతకం ఖాయం..రెజ్లింగ్ ఫైనల్ కు వినేశ్ ఫొగాట్
Paris Olympics 2024: 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వినేష్ ఫోగట్ ఫైనల్స్‌కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. క్యూబా రెజ్లర్‌ను ఓడించిన వినేష్ కు పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం ఖాయం అయ్యింది. వినేష్ ఇప్పుడు స్వర్ణ పతకానికి అడుగు దూరంలో ఉంది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ-ఫైనల్స్‌లో, ఆమె 5-0తో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో వినేష్‌కు రజత పతకం ఖాయమైంది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు సృష్టించింది. గతంలో సాక్షి మాలిక్ మహిళల రెజ్లింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. వినేష్ ఫైనల్స్‌లో విజయం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా నిలవడమే కాకుండా తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కుతుంది. ఫైనల్‌లో వినేష్ ఓడిపోయినా రజత పతకం ఖాయమైంది.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు, వినేష్‌కు ఒలింపిక్స్ మినహా అన్ని ప్రధాన పతకాలు ఉన్నాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో టైటిల్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలతో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిది పతకాలు ఉన్నాయి. అయితే రియో, టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయింది. కానీ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతాలు చేసి పతకాన్ని ఖాయం చేసుకుంది.
వినేష్ భారతదేశం నుండి మూడవ రెజ్లర్ .. రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి మహిళా రెజ్లర్. అంతకుముందు పురుషుల విభాగంలో సుశీల్ కుమార్, రవి దహియాలకు ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నప్పటికీ వీరిద్దరూ రజత పతకాన్ని దాటలేకపోయారని, అలాంటి పరిస్థితుల్లో వినేష్‌కి భారత్‌కు తొలి బంగారు పతకం సాధించే సువర్ణావకాశం దక్కనుంది. వినేష్ ఫైనల్ మ్యాచ్ ఆగస్ట్ 8 బుధవారం జరగనుంది.