IPL 2023 Auction: కొచ్చిలో ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలంలో.. ఆల్‌రౌండర్లపై కోట్లాభిషేకం
IPL 2023 Auction: ప్లేయర్స్ కోసం పోటీ పడ్డ 10 ఫ్రాంచైజీలు
IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆటగాళ్ల పంట పడింది. ఆటగాళ్ల కొనుగోలుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దాదాపు 160 కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకున్నాయి. శామ్ కరణ్‌ను రికార్డు ధర 18కోట్ల 50లక్షలకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు జాక్ పాట్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ అతడ్ని 16కోట్ల 25లక్షలతో సొంతం చేసుకుంది.
ఇక ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. ముంబయి అతడిని 17కోట్ల 50లక్షలకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లఖ్‌నవూ జట్టు 16కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్ జట్టు 13కోట్ల 25లక్షలకు సొంతం చేసుకుంది.
టీమిండియా బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ 6కోట్లకు దక్కించుకుంది. టీమిండియా ప్లేయర్ శివం మవిని గుజరాత్ టైటాన్స్ 6కోట్లకు సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌ను 5కోట్ల 75 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. బౌలర్ ముఖేశ్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 5కోట్ల 50లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 5కోట్ల 25లక్షలకు దక్కించుకుంది.