Marketa Vondrousova: వింబుల్డన్‌లో విజయ దుందుభి మోగించిన మార్కెటా వొండ్రుసోవా
Marketa Vondrousova: 6-4, 6-4తో విజయం సాధించిన వొండ్రుసోవా
Marketa Vondrousova: చెక్ రిపబ్లిక్ టెన్నిస్ తార మార్కెటా వొండ్రుసోవా వండర్ చేసింది. మార్కెటా వొండ్రుసోవా.. వింబుల్డన్‌లో విజయ దుందుభి మోగించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో వొండ్రుసోవా 6-4, 6-4తో ఆరో సీడ్, గతేడాది రన్నరప్ ఆన్స్ జెబ్యూర్‌ను వరుస సెట్లలో ఓడించింది. ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఘనత వహించింది. వొండ్రుసోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరినా.. బార్టీ చేతిలో ఓడింది. కానీ, ఈసారి గ్రాస్‌కోర్టులో బరిలోకి దిగి ఫలితం రాబట్టింది.
గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ రెండో గేమ్‌లోనే మార్కెటా సర్వీ్‌సను బ్రేక్ చేసిన జెబ్యూర్ 2-0తో ముందంజ వేసింది. అయితే, ఆ తర్వాతి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన వొండ్రుసోవా.. నాలుగో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకొని 2-2తో సమం చేసింది. మరోవైపు జెబ్యూర్ వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి 4-2తో పైచేయి సాధించింది. కానీ, ఏడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో ఒక్కసారిగా విజృంభించిన వొండ్రుసోవా.. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి తొలిసెట్‌ను ఖాతాలో వేసుకొంది. రెండో సెట్‌లో తొలి నాలుగు గేమ్‌ల్లో రెండుసార్లు వొండ్రుసోవా సర్వీ్‌సను బ్రేక్ చేసిన జెబ్యూర్ అదే ఊపులో 4-3తో ముందజ వేసింది. అయితే, వొండ్రుసోవా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 5-4తో ముందుకెళ్లింది. ఆ తర్వాత జెబ్యూర్ తప్పిదాలతో మార్కెటా 40-15తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచింది. వాలీతో మ్యాచ్‌ను ముగించి.. సంబరాలు చేసుకొంది.
ఇదో అద్భుతమైన అనుభూతి అని వొండ్రుసోవా అన్నారు. తన ప్రత్యర్థి జాబెర్ ప్రదర్శన తకెంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. గతేడాది చేతికి కట్టుతో ఇక్కడికి వచ్చానని... ఇప్పుడు ట్రోఫీతో నిలబడ్డానట్లు పేర్కొన్నారు. పునరాగమనం అంత సులువు కాదని... ఈ స్థాయికి చేరుకుంటాననే నమ్మకం తనకు ఎప్పుడూ ఉండేదంటూ వొండ్రుసోవా భావోద్వేగానికి గురైయ్యారు.