RCB Blue Jersey: బ్లూ జెర్సీతో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ సేన.. కారణం ఇదే
IPL 2021 RCB Blue Jersey: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్ బ్లూ జెర్సీతో ఆడనున్నట్లు ప్రకటించింది.
IPL 2021: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్ బ్లూ జెర్సీతో ఆడనున్నట్లు ప్రకటించింది. అయితే అది అన్ని మ్యాచులకు కాదు కేవలం ఎదో ఒక మ్యాచ్ మాత్రమే అలా ఆడనుంది. అయితే ఈ సారి బ్లూ జెర్సీ ధరించడంలో విశేషం ఉంది.
ప్రతీ ఏడాది కోహ్లీ సేన సమాజ సేవ కోసం ఒక మ్యాచ్‌ను వినియోగించకుంటున్నది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో గ్రీన్ జెర్సీలతో మ్యాచ్ ఆడింది. ప్రపంచంలో పెరిగిపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గ్రీన్ జెర్సీలను ధరించింది. అంతే కాకుండా ఆ జెర్సీలను రీసైక్లింగ్ వేస్ట్ నుంచి తయారు చేయడం గమనార్హం.
ఇప్పటి వరకు ఎరుపు, నలుపు కలర్స్ జర్సీలతో మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయతే ఈసారి బ్లూ జెర్సీతో ఆడనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి నేటి వరకు వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పీపీఈ కిట్లు ధరించి పూర్తి సేవలు అందిస్తున్నారు. నీలి రంగులోని పీపీఈ కిట్లు ధరించి అలసట లేకుండా పని చేస్తున్నారు. కరోనా వారియర్స్ కి సంఘీభావంగా ఒక మ్యాచ్‌లో బ్లూ జెర్సీలతో మ్యాచ్ ఆడనున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వెల్లడించింది.
అంతేకాదు క్రికెటర్లు ధరించిన జెర్సీలపై సంతకం చేస్తారు. ఆ తర్వాత వాటిని వేలం వేస్తారని యాజమాన్యం తెలిపింది. అంతే కాకుండా వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వైద్య రంగంలో మౌళిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తామని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను కొనడానికి కూడా వినియోగించనున్నారు. ఇలా ప్రతీ ఏడాది తీవ్రమైన సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఒక వినూత్న జెర్సీతో మ్యాచ్ ఆడుతున్నది.
కాగా, ఈ సీజన్‌లో వరుస విజయాలతో కోహ్లీ సేన పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. బెంగళూరు - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మరో మ్యాచ్ సోమవారం సాయంత్రం జరగనుంది.