ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సైలెంట్ గా ఉన్న క్రీడాభిమానుల్లో జోష్ నింపడానికి ఐపీఎల్ సిద్ధమైంది. దాదాపు 46 రోజుల పాటు 56 మ్యాచ్‌లుగా సాగే ఈ మెగాటోర్నీకి అన్ని ఏడారి దేశాలు సిద్ధమయ్యాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఉత్కంఠకు తెరపడింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డ్రీమ్ 11 ఐపీఎల్ 13వ సీజన్ రెడీ అయింది. ఆది నుంచి మెగా టోర్నీకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్వహించేందుకు సిద్ధపడింది. అందుకు సంబంధించిన షెడ్యుల్డ్ ను కూడా విడుదల చేసింది. ఏటా పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సీజన్‌ను కూడా గతేడాది ఫైనలిస్టులతోనే ప్రారంభించేందుకు ప్లాన్ వేసింది.
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబి వేదికగా ఈ నెల 19న ఫస్ట్ మ్యాచ్ తో లీగ్ కు తెరలేవనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా 46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇన్ని రోజులు లీగ్ జరుగడం ఇదే తొలిసారి. మొత్తం మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 జరుగనున్నాయి. అయితే ఫ్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో మొత్తం పది హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి.
రెండేసి మ్యాచ్‌లున్న రోజుల్లో తొలి మ్యాచ్ మద్యాహ్నం 3.30గంటలకు మొదలవనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి మ్యాచ్‌లు 8 గంటలకు బదులుగా 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు అమీతూమీ తేల్చుకోనున్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈనెల 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. మొత్తానికి కరోనా నిబంధనలు పాటిస్తూ ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. మొత్తానికి మెగాటోర్నీ ప్రారంభానికి సమయం సన్నద్ధం అయింది.