IPL 2020 Match 14 Updates : ధోనీ సేన 'టాప్' లేపిన సన్ రైజర్స్!
IPL 2020 Match 14 Updates : చెన్నై సూపర్ కింగ్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
దుబాయి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయినా.. మెల్లగా పుంజుకుంది. బౌలింగ్ కి అనుకూలిస్తున్న పిచ్ పై జాగ్రత్తగా ఆడి చెన్నై ముందు చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ఉంచింది. 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మొదట్లో కొద్దిగా బాగా కనిపించినా తరువాత వరుసగా త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పరుగులు తీయడానికి తంటాలు పడటమే కాకుండా వికెట్లను కూడా పాడేసుకున్నారు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో 7 పరుగుల తేడాతో అపజయం పాలైంది చెన్నై.
చెన్నై బ్యాటింగ్ లో వాట్సన్(1) విఫలం కాగా, ఆపై అంబటి రాయుడు(8), డుప్లెసిస్(22), కేదార్ జాదవ్(3)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దాంతో సీఎస్‌కే 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాతొ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. జడేజా 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ సాధింఛి వెంటనే అవుట్ అవడంతో చెన్నై కష్టాల్లో పడిపోయింది ఈ దశలో సామ్ కరాన్ తొ కలిసి ధోనీ శాయశక్తులా గెలుపు కోసం ప్రయత్నించాడు. అయితే, సన్ రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముఖ్యంగా చివరి ఓవర్లలో ఆ జట్టు బౌలింగ్ ముందు ధోని లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం అయ్యాడు. ధోని 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. సామ్ కరాన్ 5 బంతుల్లో 2 సిక్స్‌లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకూ ఆసక్తిరేపిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన మనీష్ పాండే బ్యాట్‌కు పనిచెప్పాడు. కాకపోతే మంచి టచ్‌లో ఉన్న సమయంలో మనీష్ పాండే(29; 21 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సామ్ కరాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 47 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్‌ను కోల్పోయింది.మరో 22 పరుగుల వ్యవధిలో డేవిడ్ వార్నర్(28; 29 బంతుల్లో 3 ఫోర్లు)ను డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్‌తో ఔట్ చేయగా, ఆపై వెంటనే కేన్ విలియమ్సన్ రనౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది హైదరాబాద్.
అటు తరువాత ప్రియం గర్గ్-అభిషేక్‌లు ఒక్కసారిగా చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వీరిద్దరూ 76 పరుగులు జత చేశారు. అభిషేక్(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. తర్వాత ప్రియం గర్గ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్ సామద్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు సాధించగా, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు.