IPL 2020 Match 10 Updates : బెంగళూరు 'సూపర్' విజయం!
IPL 2020 Match 10 Updates : విరాట్ కోహ్లీ సారధ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబాయి జట్టు పై సూపర్ ఓవర్ లో విజయం సాధించింది.
మరో రోమాంచితమైన మ్యాచ్.. ఐపీఎల్ మజా చూపించిన మ్యాచ్. చివరి బంతి వరకూ విజయం దోబూచులాట. చివరికి టై! సూపర్ ఓవర్!! భారీ లక్ష్యం.. 5 ఓవర్లలో 91 పరుగులు చేయాలి.. అంటే ఓవర్ కు 18 పరుగులు.. ఈ స్థితిలో ఎవరూ ఊహించని పరిణామం.. అప్పటివరకూ జాగ్రత్తగా ఆడుతున్న కిషన్ కు పోలార్డ్ జత కలిశాడు. అగ్నికి గాలిలా.. అంతే సీన్ మారిపోయింది. సిక్స్ లతో గ్రౌండ్ హోరెత్తింది. ఒక పక్క పోలార్డ్ రెచ్చిపోతుంటే మరో పక్క కిషన్ అతనితో సహకరిస్తూనే తన బ్యాట్ కూ పని చెప్పాడు. అంతే సెంచరీ కి సమీపంలోకి వెళ్ళిపోయాడు. ముంబాయి ఇన్నింగ్స్ నూ విజయం ముందుకు తీసుకువచ్చేశాడు. దురదృష్టంతో ఔట్ అయిపోయాడు. ఒక్క బంతి ఐదు పరుగులు క్రీజులో పోలార్డ్.. ఏం జరుగుతుందనే టెన్షన్. చివరికి ఉదానా ఇన్నింగ్స్ చివరి బంతి వేశాడు. పోలార్డ్ బాల్ లాంగాన్ దిశగా పంపించాడు. అంతే బౌండరీ.. సరిగ్గా స్కోర్ లు సమానం అయ్యాయి.. దీంతో సూపర్ ఓవర్ ఫలితం తేల్చింది.
సూపర్ ఓవర్ ఇలా..
ముంబాయి.. బ్యాట్స్ మెన్ పోలార్డ్..హార్దిక్ పాండ్యా.. బెంగళూరు బౌలర్.. సైనీ
మొదటి బాల్.. పోలార్డ్ ఒక్క పరుగు
రెండో బాల్... హార్దిక్ పాండ్యా.. ఒక్క పరుగు
మూడో బాల్ .. పోలార్డ్ డాట్
నాలుగో బాల్..పోలార్డ్ .. నాలుగు పరుగులు
ఐదో బాల్.. పోలార్డ్ ఔట్!
ఆరో బాల్.. రోహిత్ శర్మ..ఒక్క పరుగు మొత్తం 7 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు 8 పరుగులు చేస్తే విజయం సాధిస్తారు.
బెంగళూరు..బ్యాట్స్ మెన్ డివిలియర్స్.. కోహ్లీ.. ముంబయి బౌలర్..బుమ్రా
మొదటి బాల్.. డివిలియర్స్ ఒక్క పరుగు
రెండో బాల్.. కోహ్లీ.. ఒక్క పరుగు
మూడో బాల్.. డివిలియర్స్.. డాట్ బాల్
నాలుగో బాల్.. డివిలియర్స్.. బౌండరీ
ఐదోబాల్..డివిలియర్స్..సింగిల్
ఆరో బాల్.. కోహ్లీ.. బౌండరీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం!
అలా సూపర్ ఓవర్ లో కోహ్లీ సేన విజయం సాధించింది.
ఇక అంతకు ముందు ముంబాయి చేజింగ్ ఎలా సాగిందంటే..
* రోహిత్‌శర్మ(8), క్వింటన్ డికాక్(5) బ్యాటింగ్ ఆరంభించారు. ఇసురు ఉదాన వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ సిక్స్ కొట్టగా, డికాక్ బౌండరీ కొట్టాడు. దీంతో తొలి ఓవర్‌లో ఈ జట్టు 14 పరుగులు చేసింది.
* ముంబయికి ఆదిలోనే షాక్ తగిలింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 2వ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(8) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ పవన్ నేగి చేతికి చిక్కాడు. చివరి బంతికి డికాక్ రెండు పరుగులు తీయడంతో ఆ జట్టు స్కోర్ 16/1గా నమోదైంది.
* ఇసురు ఉదాన వేసిన మూడో ఓవర్ రెండో బంతికే సూర్యకుమార్(0) షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ముంబయి 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(5) ఒక బౌండరీ బాదడంతో ఈ ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. డికాక్(9) బ్యాటింగ్ చేస్తున్నాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి స్కోర్ 23/2కి చేరింది.
* చాహల్ వేసిన 7వ ఓవర్ నాలుగో బంతికి క్వింటన్ డికాక్(14) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడబోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ పవన్ నేగి చేతికి చిక్కాడు. దీంతో ముంబయి 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య క్రీజులోకి రాగా, ఈ ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో 7 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 41/3గా నమోదైంది.
* ఆడం జంపా వేసిన 8వ ఓవర్ ఐదో బంతికి హార్దిక్ పాండ్య(9) భారీ సిక్సర్ బాదడంతో పాటు మరో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో 8 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 52 పరుగులకు చేరింది. ఇషాన్ కిషన్(19) పరుగులతో ఉన్నాడు.
* 10 ఓవర్లకు ముంబయి స్కోర్ 63/3గా నమోదైంది. ఇషాన్ కిషన్(25), హార్దిక్ పాండ్య(15) బ్యాటింగ్ చేస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. ముంబయి విజయానికి ఇంకా 60 బంతుల్లో 139 పరుగులు చేయాలి.
* నవ్‌దీప్ సైని వేసిన 11వ ఓవర్‌లో ఇషాన్ కిషన్(38) రెండు సిక్సులు బాదడంతో పాటు మరో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు లభించాయి. హార్దిక్(15) పరుగులతో ఆడుతున్నాడు. ఈ ఓవర్ పూర్తయ్యేసరికి ముంబయి స్కోర్ 77/3కి చేరింది.
* ఆడం జంపా వేసిన 12వ ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్య(15) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడబోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ పవన్ నేగి చేతికి చిక్కాడు. దీంతో ముంబయి 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కిరన్ పొలార్డ్(1) ఒక పరుగు తీశాడు. ఈ * ఓవర్ పూర్తయ్యేసరికి ముంబయి 83/4కి చేరింది. మరోవైపు ఇషాన్ కిషన్(43) అర్ధశతకానికి చేరువయ్యాడు.
* జంపా వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్ కిషన్(52) చివరి బంతికి సిక్స్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు మరో మూడు పరుగులు రావడంతో ఈ ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబయి స్కోర్ 98/4. పొలార్డ్(5) పరుగులతో ఆడుతున్నాడు.
* 15 ఓవర్లకు ముంబయి స్కోర్ 112/4గా నమోదైంది. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఇషాన్ కిషన్(61) ఒక సిక్స్ కొట్టగా పొలార్డ్(10) ఒక ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. ముంబయి విజయానికి 30 బంతుల్లో 90 పరుగులు చేయాలి.
* జంపా వేసిన 17వ ఓవర్‌లో పొలార్డ్(38) రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో మొత్తం 27 పరుగులు తీశాడు. వరుసగా 4 ,6, 6, 2, 6, 3 బాదడంతో ముంబయి స్కోర్ 149/4కి చేరింది. 18 బంతుల్లో 53 పరుగులు చేయాలి.
* చాహల్ వేసిన 18వ ఓవర్‌లలో ముంబయి 22 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో పొలార్డ్(53) రెండు సిక్సర్లు బాదగా ఇషాన్ కిషన్(77) కూడా ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో 18 ఓవర్లకు ముంబయి స్కోర్ 171/4గా నమోదైంది. రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాలి.
* నవ్‌దీప్ సైని వేసిన 19వ ఓవర్‌లో ముంబయి 12 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో కిషన్(86) ఒక సిక్సర్ బాదడంతో పాటు మరో ఆరు పరుగులు వచ్చాయి. పొలార్డ్(55) పరుగులతో ఆడుతున్నాడు. దీంతో 19 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 183/4గా నమోదైంది. చివరి ఓవర్‌లో ఆ జట్టు 19 పరుగులు చేయాలి.
* ఉదానా వేసిన చివరి ఓవర్లో ముంబాయి 18 పరుగులు చేసింది. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. సూపర్ ఓవర్ లో ఫలితం తేలింది. బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది.