Indian Sprinter Milkha Singh: భారత్ పరుగుల వీరుడు మిల్కా సింగ్ ఇకలేరు
Indian Sprinter Milkha Singh: భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి మరణించారు.
Indian Sprinter Milkha Singh: భారత్ పరుగుల వీరుడు.. కరోనాతో పోరాడుతూ మృతి చెందాడు. ఒకప్పుడు క్రీడా పతకాల కోసం తనతో తానే పోరాడి గెలిచిన మిల్కాసింగ్.. నేడు కరోనాతో పోరాడి గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయాడు. ఇప్పటికే ఒకసారి కోవిడ్ బారిన పడి డిశ్చార్జి అయిన 91 ఏళ్ళ మిల్కాసింగ్ కు మళ్లీ ఆరోగ్య సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరి మృత్యువాత పడ్డాడు.
శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జ్వరం ఎక్కువ కావడం.. ఆక్సిజన్ స్థాయిలో తగ్గడంతో మిల్కాసింగ్‌ను ఐసీయూకు తరలించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మిల్కాసింగ్ శుక్రారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మే 24 న "కోవిడ్ న్యుమోనియా" కారణంగా ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసీయులో చేరారు. అనంతరం జూన్ 3 న చండీగర్‌లోని పిజిఐఎంఆర్‌కు తరలించారు. ఇదిలా ఉంటే మిల్కాసింగ్ భార్య నిర్మల్ కూడా ఇటీవల కరోనా కారణంగా మరణించిన విషయం తెలిసిందే.
మిల్కాసింగ్ 1932 నవంబర్ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో జన్మించారు. సిక్‌రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్‌కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో 'భాగ్ మిల్కా భాగ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
మిల్కాసింగ్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా మిల్కాసింగ్ దేశ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ.. మిల్కాసింగ్ మరణ వార్త కలిచి వేసిందని, ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తి చేశారు.