Australia vs India: స్మిత్‌కు టీమిండియా అభిమానులు క్షమాపణలు.. సోషల్ మీడియాలో వైరల్
సిడ్నీ టె్స్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను మార్క్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కావాలనే చెరిపేశాడని అతనిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దపు చీటర్ అవార్డు ఇవ్వాలని తీవ్రంగా విమర్శించాడు. ఫ్యాన్సే కాదు మాజీ క్రికెటర్లు సైతం స్మీత్ సైలిపై దుమ్మెత్తిపోశారు. అయితే అసలు విషయం తెలుసుకొని భారత అభిమానులు నాలుక కరచుకుంటున్నారు. అపార్థం చేసుకున్నామని గ్రహించిన భారత అభిమానులు అతనికి భేషరతుగా క్షమాపణలు చెబుతున్నారు.
మూడో టెస్ట్ ఐదో రోజు రెండో సెషన్‌లో ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్ చేసుకున్న మార్క్‌ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాల్లో రికార్డు అయింది. వాస్తవానికి స్టీవ్ స్మిత్‌ది ఏ మాత్రం తప్పులేదు. అతన్ని అందరూ అపార్థం చేసుకున్నారే విషయం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. స్మిత్ చెప్పినట్లుగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పూర్తి వీడియోలో స్మిత్ కన్నా ముందే మైదాన సిబ్బంది పిచ్‌ను క్లీన్ చేశారు. #sorrysmith యాష్ ట్యాగ్‌తో ఆ పూర్తి వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. భారత అభిమానలు సారీ స్మిత్ కామెంట్ చేశారు.
స్మిత్ పై ఆరోపణలు రావడంతో స్టీవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ.. క్రీజులో గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది'అని స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఈ సిరీస్ లో మిగిలిన నాలుగో టెస్టు ఈనెల 15 నుంచి జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ ఆస్ట్రేలియా చెరో ఒక మ్యాచ్ విజయం సాధించి సమానంగా ఉన్నాయి. చివరిదైన నిర్ణయత్మాక టెస్టు మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికే టెస్టు సిరీస్ సొంతం అవుతుంది.