వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటన కోసం భారత్ రానుంది. ఈ పర్యటనలో మ్యాచ్ లు జరిగే వేదికలను ఖరారు చేసినట్టు బీసీసీఐ, ఈసీబీ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ సిరీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ 4 టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనున్నాయి. అయితే, మ్యాచ్ ల సంఖ్య ఎక్కువగానే ఉన్నా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేవలం మూడు వేదికలనే ఎంపిక చేశారు. కేవలం చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాల్లోనే మ్యాచ్ లు జరగనున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు వేదికలు ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ధృవీకరించారు. భారత్ - ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం అవుతుందని జైషా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ సిరీస్‌లో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు భారత్ - ఇంగ్లాండ్ దేశాల మధ్య డే నైట్ టెస్టు మ్యాచ్ మొతేరాలోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరుగుతుందని జైషా స్పష్టం చేశారు. అంతేకాదు టీట్వంటీ సిరీస్ మొత్తం కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుందని షా చెప్పారు. మొత్తం 5 టీట్వంటీ మ్యాచ్‌లు ఈ కొత్త స్టేడియంలో జరుగుతాయని షా చెప్పారు. ఈ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీట్వంటీ మ్యాచ్‌లు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి.
టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, ఆ తర్వాతి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో నిర్వహిస్తారు. ఇక టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుండగా, అన్ని మ్యాచ్ లు అహ్మదాబాద్ లో జరుగుతాయి. అనంతరం, మార్చి 23న వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ మ్యాచ్ లన్నీ పుణేలో నిర్వహిస్తారు. 2016 తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 2018 తర్వాత రెండు దేశాల మధ్య సిరీస్ జరగడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.
కరోనా కారణంగా భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి భారత్‌లో జరుగుతుండటంతో అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టోర్నమెంట్ చివరిదిగా నిలిచింది. ఇక ఆ తర్వాత మ్యాచ్‌లు ఏవీ భారత్‌లో జరగలేదు. ఆ తర్వాత విరాట్ సేన న్యూజిలాండ్ పర్యటన చేసింది. ఆ వెంటనే కరోనావైరస్ విజృంభించడంతో క్రికెట్ యాక్షన్ ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయింది. ప్రస్తుతం క్రమక్రమంగా ఊపందుకుంటోంది.