Indvs Eng 1st Test: ముగిసిన తొలి రోజు ఆట.. ఇంగ్లాండ్‌దే పైచేయి
తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసింది
చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 89.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీతో సత్తాచాటాడు. ఓపెనర్ సిబ్లీ (87; 285 బంతుల్లో, 12×4) కూడా అర్థ శతకంలో రాణించడంతో.. మొదటి రోజు ఆట ముగిసేసరికి మెరుగైన స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయాన్ని సరైందని నిరూపించారు ఓపెనర్లు.. తొలి వికెట్ శుభారంభాన్నిఇచ్చారు. ఓపెనర్లు బర్న్స్(33) సిబ్లీ ఇద్దరూ కలిసి 63 పరుగుల శుభారంభాన్ని ఇచ్చారు. ప్రమాదకరంగా మరుతున్న వీరి జోడిని బర్న్స్ వికెట్ తీసి అశ్విన్ విడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లారెన్స్ ఖాతా తెరవకుండానే బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ రూట్ సిబ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భూజన వేసుకున్నాడు. ఇరువురు కలిసి మూడో వికెట్ కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి రోజు ఆఖరి ఓవర్లలో బుమ్రా మాయ చేశాడు. ఆఖరి ఓవర్‌లో బంతి అందుకున్న బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో సిబ్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.