SA vs IND: మూడో వన్డేలో సౌతాఫ్రికాపై టీమిండియా విక్టరీ.. సెంచరీతో కదం తొక్కిన సంజూ శాంసన్

SA vs IND: 78 పరుగుల తేడాతో రాహుల్ సేన విజయం

Update: 2023-12-22 01:47 GMT

SA vs IND: మూడో వన్డేలో సౌతాఫ్రికాపై టీమిండియా విక్టరీ.. సెంచరీతో కదం తొక్కిన సంజూ శాంసన్

SA vs IND: సఫారీల గడ్డపై యంగ్ టీమిండియా మరో సారి సత్తా చాటింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పార్ల్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో రాహుల్ సేన 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ సెంచరీతో చెలరేగాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేశాడు శాంసన్. మరోవైపు తిలక్ వర్మ కూడా 52 పరుగులతో రాణించాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన రింకు సింగ్ 38 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 296 పరుగుల చేసింది..

297 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. రెండో వన్డేలో సెంచరీ బాదిన టోనీ డి జోర్జి ఈ మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 81 పరుగులతో రాణించాడు. ఒక దశలో.. సౌతాఫ్రికా 25 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 135 పరుగుల స్కోరుతో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ, వాషింగ్టన్ సుందర్‌ వేసిన తర్వాతి ఓవర్‌ నుంచి సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. మార్‌క్రమ్‌ని సుందర్‌ వెనక్కి పంపగా.. కొద్దిసేపటికే జోర్జిని అర్ష్‌దీప్‌ ఔట్ చేశాడు.

ఆ తర్వాత అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో... సాయి సుదర్శన్ మిడాఫ్‌లో మంచి డైవ్‌ చేసి క్యాచ్‌ అందుకోవడంతో క్లాసెన్ వెనుదిరిగాడు. ఆతర్వాత సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోవడంతో.. చివరికి ఆ జట్టు 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు, అవేశ్‌ ఖాన్‌, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ముకేశ్‌ కుమార్, అక్షర్ పటేల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.

Tags:    

Similar News