IND vs NZ 2nd Test: పూణెలో తిప్పేసిన సాంట్నర్.. 156 పరుగులకే భారత్ ఆలౌట్..
India vs New Zealand, 2nd Test: పూణె టెస్టులో టీమిండియా పరిస్థితి బెంగళూరులా మారింది.
India vs New Zealand, 2nd Test: పూణె టెస్టులో టీమిండియా పరిస్థితి బెంగళూరులా మారింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటవగా, రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ 7 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో సాంట్నర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. భారత్ తరపున రవీంద్ర జడేజా 38 పరుగులు చేశాడు. సాంట్నర్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీశాడు.
భారత్ 16/1 స్కోరుతో ఆడటం ప్రారంభించింది. 50 పరుగుల స్కోరు వద్ద శుభ్‌మాన్ గిల్‌ను సాంట్నర్ ఎల్‌బీడబ్ల్యుగా అవుట్ చేశాడు. గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 1 పరుగు చేసి ఔటయ్యాడు. సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతిని స్వీప్ చేసేందుకు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 బంతుల్లోనే కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత, గత టెస్ట్ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించినా, ఫలితం లేకపోయింది. కానీ, ఇద్దరూ చెడ్డ షాట్లు ఆడటంతో అవుటయ్యారు. పంత్ 18 పరుగులు, సర్ఫరాజ్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
దీంతో భారత్ 95 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ, అతనికి అవతలి వైపు నుంచి ఎవరి మద్దతు లభించలేదు. ఆర్ అశ్విన్ 4 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 18, ఆకాశ్‌దీప్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. సాంట్నర్ 53 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఇజాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరపున డెవాన్ కాన్వే 76 పరుగులు, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశారు. వీరితో పాటు మిచెల్ సాంట్నర్ 33 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో ప్లేయింగ్-11లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇది అతనికి తొలి ఐదు వికెట్ల హాల్. అతనికి తోడు ఆర్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు.