Hyderabad: ఐపీఎల్ కు నకిలీ టికెట్ల బెడద.. ఆరుగురు డూప్లికేటుగాళ్లు అరెస్ట్..
Fake IPL Tickets: క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.
Fake IPL Tickets: క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. కరోనా తర్వాత ఫస్ట్ టైమ్ స్టేడియంకి వెళ్లి ఐపీఎల్ మ్యాచులు తిలకించే అవకాశం దక్కడంతో టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని పసిగట్టిన కొందరు కేటుగాళ్లు ఇదే అదనుగా ఫేక్ టికెట్లను ముద్రించి అమ్ముకుంటున్నారు. నకిలీ ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ఓ ముఠా తాజాగా హైదరాబాద్ లో పట్టుబడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా బార్ కోడ్ ను కాపీచేసి నకిలీ టికెట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది.
హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన కే.గోవర్థన్ రెడ్డి ఈవెంట్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ వెండర్ ఏజెన్సీలో సబ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఇతను ఐపీఎల్ మ్యాచ్ లో టికెట్ వ్యాలిడేటర్ల కోసం అఖిల్ అహ్మద్, వంశీ, శ్రవణ్ కుమార్, ఇజాజ్ లను నియమించుకున్నాడు. వీరంతా ముఠాగా ఏర్పడి తమకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులోని బార్ కోడ్ ను కాపీ చేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. అలా వీరు 200లకు పైగా నకిలీ టికెట్లు ప్రింట్ చేసి పబ్లిక్ కి అమ్మేశారు.
నకిలీ టికెట్లు చలామణి అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిఘా వేయగా ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి 68 నకిలీ ఐపీఎల్ టికెట్లతో పాటు, సెల్ ఫోన్లు, సీపీయూ, హార్డ్ డిస్క్, మానిటర్, ప్రింటర్, అక్రిడిటేషన్ కార్డులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించారు.