బదులు తీరింది. ఘోర పరాజయం మూటగట్టుకున్న చోటే ప్రతీకార విజయాన్ని సాధించింది టీమిండియా. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో పరాజయం పాలైన ఇండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ లో అన్నిరంగాలలోనూ అద్భుత ప్రతిభ చూపించి ఆ ఓటమికి బదులు తీర్చుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తమను ఉక్కిరిబిక్కిరి చేసిన ఇంగ్లడ్ ఆటగాళ్లను రెండో టెస్ట్ మ్యాచ్ లో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వకుండా టీమిండియా విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 1-1 తో సమం చేసుకుంది.
విజయానికి 482 పరుగులు చేయాల్సిన స్థితిలో.. ఓవర్ నైట్ స్కోర్ మూడు వికెట్లకు 53 పరుగులతో మంగళవారం బ్యాటింగ్ ప్రారంభించింది ఇంగ్లండ్ జట్టు. అయితే, భారీ స్కోరును చేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు ఇబ్బందులు ఎదుర్కుంది. భారత బౌలర్లు బప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్పిన్నర్ అశ్విన్, అక్షర్ పటేల్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. కెప్టెన్ జో రూట్ (33) ఒక్కడే భారత బౌలర్లను కాస్త అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ముందు నిలువలేకపోయారు. దీంతో 164 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ బౌలింగ్ హీరోలు అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉంటె ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్ అహ్మదాబాద్ లో జరగనుంది. నిర్ణయాత్మకమైన ఈ టెస్ట్ మ్యాచ్ ఈనెల 24న ప్రారంభం అవుతుంది.
స్కోర్లు:
టీమిండియా:
తొలి ఇన్నింగ్స్: 329 పరుగులు
వికెట్లు: మొయిన్ అలీ 4, ఓలీ స్టోన్ 3, జాక్ లీచ్ 2, రూట్ 1
రెండో ఇన్నింగ్స్: 286 పరుగులు
వికెట్లు: జాక్ లీచ్ 4, మొయిన్ అలీ 4, ఓలీ స్టోన్ 1
ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్: 134 పరుగులకు ఆలౌట్
వికెట్లు: అశ్విన్ 5, ఇషాంత్ 2, అక్షర్ 2, సిరాజ్ 1
రెండో ఇన్నింగ్స్: 164 ఆలౌట్
వికెట్లు: అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2