Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలోనూ ధోని శిష్యుడిదే ఆధిపత్యం.. తుఫాన్ బ్యాటింగ్‌తో దుమ్మురేపిన ప్లేయర్ ఎవరంటే?
విజయ్ హజారే ట్రోఫీ 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ నిలిచాడు.
Vijay Hazare Trophy 2021: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ 2021లో ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో తమిళనాడును ఓడించి, అద్భుత విజయం సొంతం చేసుకుంది. కానీ, ఈ టోర్నీలో మహారాష్ట్ర ఆటగాడు హిమాచల్ బ్యాట్స్‌మెన్స్ కంటే ఓ లిస్టులో ముందున్నాడు. ఈ ఆటగాడు 5 మ్యాచుల్లో 4 సెంచరీలు చేసి పరుగుల వర్షం కురిపించాడు. అయినప్పటికీ, అతని జట్టు గ్రూప్ డీ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రితురాజ్ గైక్వాడ్ గురించి ఇఫ్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 603 పరుగులు చేసి తన సత్తాను చాటాడు. ఐపీఎల్‌లోనూ అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
విజయ్ హజారే టోర్నీలో మహారాష్ట్ర తొలి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌తో తలపడింది. ఇందులో రీతురాజ్ 112 బంతుల్లో 136 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత తదుపరి మ్యాచ్ ఛత్తీస్‌గఢ్‌తో జరిగింది. ఇందులో రితురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో రితురాజ్ 14 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లోనూ అతని జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఈ టాలెంటెడ్ ఐసీఎల్ బ్యాట్స్‌మెన్ 124 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో రితురాజ్ 168 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
మహారాష్ట్ర తరపున, విజయ్ హజారే ట్రోఫీ 2021లో రితురాజ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో మొత్తం 603 పరుగులు సాధించాడు. ఈ సమయంలో, అతను మొత్తం 51 ఫోర్లు, 19 సిక్సర్లు బాదేశాడు. ఈ సీజన్‌లో రితురాజ్ అత్యుత్తమ స్కోరు 168 పరుగులుగా నిలిచింది. ఈ సమయంలో అతను 150.75 సగటుతో పరుగులు రాబట్టాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రితురాజ్ నిలవడం విశేషం. అతని తర్వాత విజేత జట్టు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. రిషి 8 ఇన్నింగ్స్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 91 నాటౌట్‌గా నిలిచింది.
ఐపీఎల్‌లో రితురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. 2021 సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు సాధించాడు. 64 ఫోర్లు, 23 సిక్సర్లతో తన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. ఈ సీజన్‌లో రితురాజ్ సెంచరీ కూడా చేశాడు.