పాక్ క్రికెట్ జట్టుపై కరోనా దెబ్బ.. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే 10 వికెట్లు డౌన్

Update: 2020-06-23 16:18 GMT

కరోనాతో క్రీడారంగం తీవ్ర సంక్షోభంతో ఉంది. చాలా కాలం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్‌ క్రికెట్‌ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదికి కొవిడ్ సోకగా..ఇటీవలే ఓ దివ్యాంగ ఆటగాడు ఇర్ఫాన్ కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే.

ఇక అంతర్జాతీయ క్రికెట్ జట్టులో ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్‌ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం పాక్‌ యువ ఆటగాడు హైదర్‌ అలీతో పాటు హారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్లు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, వహాబ్ రియాజ్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

ఇంగ్లాడ్ సిరీస్‌ కోసం ఎంపికైన 29 మంది క్రికెటర్లకు కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు. జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌తో పాటు పాక్‌ జట్టు ప్రధాన కోచ్‌ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్‌ క్లిఫ్‌ డెకాన్‌ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ)లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్‌ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.


Tags:    

Similar News