IPL 2022 : ఐపీఎల్ 2022 కోసం పోటీపడుతున్న లక్నో, అహ్మదాబాద్, పూణే
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో అత్యంత ఆదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్.
IPL 2022 Bidding: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో అత్యంత ఆదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్. ప్రముఖ విదేశీ క్రికెటర్లతో పాటు దేశీయ ఆటగాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఐపీఎల్ వచ్చే ఏడాది అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. భారత్ లో కరోన కారణంగా అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ 2021.. సెప్టెంబర్ 19 నుండి మలిదశ ప్రారంభంకానుంది. యూఏఈలో ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణకి దాదాపుగా పనులు పూర్తి చేసుకున్న భారత క్రికెట్ నియత్రణ మండలి(బిసిసిఐ) రానున్న ఏడాది ప్రస్తుతం ఉన్న 8 టీమ్స్ తో పాటు మరో రెండు కొత్త టీమ్స్ కి చోటు ఇవ్వనుంది.
అందులో భాగంగా బిసిసిఐ బిడ్ దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏడాదికి 3వేల కోట్ల టర్నోవర్ ఉండి ఫ్రాంచేజీ తీసుకోవడానికి ఆసక్తి ఉన్న ఏ కంపెనీ అయిన ఈ బిడ్ లో 10 లక్షలరూపాయల డిపాజిట్ తో అక్టోబర్ 5 లోపు పాల్గొనవచ్చని బిసిసిఐ తెలిపింది. ఇక ఇప్పటి వరకు టీం బేస్ ప్రైస్ 1700 కోట్ల రూపాయలు ఉండగా తాజాగా 2 వేల కోట్లకు బేస్ ప్రైస్ ని పెంచింది. అయితే ఈ ఐపీఎల్ టీం ఫ్రాంచేజీ కోసం అదాని గ్రూపు, ఆర్పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్స్ తో పాటు ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ కూడా ఈ బిడ్ లో పాల్గొని ఫ్రాంచేజీ ని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
దీంతో అహ్మదాబాద్, లక్నో, పూణే జట్లలో ఏవైనా రెండు జట్లు ఐపీఎల్ 2022 లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. తాజాగా 10 జట్లతో ఐపీఎల్ 2022 ని నిర్వహించబోతున్న బిసిసిఐ 5వేల కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్రస్తుతం 3 వేల నుండి 4 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్న బిసిసిఐ రానున్న ఏడాది ఆదాయాన్ని మరింత పెంచుకోనుంది.