ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ

ICC World Cup 2023: విమర్శలపై స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా

Update: 2023-06-29 05:51 GMT

ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ

ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ వేదికలపై వివాదం నెలకొంది. భారత్ లో ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ కోసం ఐసీసీ షెడ్యూల్ ను ప్రకటించింది. నిన్న ముంబైలో జరిగిన ఐసీసీ సమావేశం తర్వాత దీనిపై ప్రకటన వెలువడింది. ఇందులో కొన్ని ప్రముఖ స్టేడియాలకు అసలు చోటే దక్కలేదు. దీంతో వేదికల ఎంపికపై రాజకీయ దుమారం నెలకొంది.

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, ముంబై, పుణె మొత్తం పది వేదికల్లో ప్రపంచకప్ 48 మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇవి జరుగుతాయి. కానీ, మోహాలి, ఇండోర్, రాజ్ కోట్, రాంచీ, నాగ్ పూర్ స్టేడియంలకు వేదికలు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా మోహాలి వేదికపై దుమారం నెలకొంది. 1996 నుంచి ప్రపంచకప్ మ్యాచులకు ఇది వేదికగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు.

 రాజకీయ జోక్యం వల్లే మోహాలీని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మోహాలీకి చేయిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు.

ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇందులో వివక్ష ఏమీ లేదని, ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన మ్యాచులను మోహాలీకి కేటాయిస్తామన్నారు. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ గతేడాది మోహాలీకే కేటాయించామని గుర్తు చేశారు. మోహాలీలో ముల్లాన్ పూర్ స్టేడియం సిద్ధమవుతోందని... అది సిద్ధమైతే అందులోనూ ప్రపంచకప్ మ్యాచ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం మోహాలీలో ఉన్న స్టేడియం ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని.... అందుకే ఆ వేదికకు మ్యాచులు కేటాయించలేదన్నారు. రోటేషనల్ విధానంలో ద్వైపాక్షిక సిరీస్‌లను మోహాలీకి ఇవ్వడం జరుగుతుందని... త్రివేండ్రమ్‌‌కు మొదటిసారి వార్మమ్ మ్యాచ్ లే కేటాయించామని తెలిపారు. ఏ సెంటర్‌నూ నిర్లక్ష్యం చేయలేదని రాజీవ్ శుక్లా వివరించారు.

Tags:    

Similar News