IPL 2021 New Rule: ఐపీఎల్ లో కొత్త రూల్..ఇకపై సిక్సర్ కొడితే కొత్త బంతే
IPL New Rules 2021: కరోనా కారణంగా అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈలో నిర్వహించబోతున్నట్లు బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా యూఏఈ కు బయలుదేరనుంది. ఐపీఎల్ రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్ లను పకడ్బందిగా నిర్వహించడానికి బిసిసిఐ కొత్త మార్గదర్శకలను విడుదల చేసింది. ఈ రూల్స్ సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతున్న మ్యాచ్ తో అందుబాటులోకి రానున్నాయి.
గతంలో బ్యాట్స్ మెన్ బంతిని స్టాండ్స్ లోకి సిక్సర్ గా పంపితే తిరిగి అదే బంతితో మ్యాచ్ ని కొనసాగించేవారు. కాని తాజా నిబంధనల ప్రకారం బంతి స్టాండ్స్ లోకి వెళితే ఆ బంతిని ఉపయోగించకుండా దాని స్థానంలో కొత్త బంతితో మ్యాచ్ ను కొనసాగించాలని నిర్ణయించారు.ప్రేక్షకుల మధ్యకి బంతి వెళితే ఆ బంతిని ఎవరైనా పట్టుకున్న వారి నుండి బంతికి వైరస్ అంటుకొని ఆటగాళ్ళకు కరోనా సోకే ప్రమాదం ఉన్నందున ఈ కొత్త బంతి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ కొత్త బంతి నిబంధన మాత్రం బౌలర్స్ కంటే బ్యాట్స్ మెన్ లకే ఎక్కువగా ఉపయోగపడనుంది. హార్డ్ గా ఉండే కొత్త బంతి వలన బ్యాట్స్ మెన్ బ్యాట్ పైకి బంతి అనుకూలంగా రావడమే కాకుండా అవలీలగా పరుగులను సాధించే అవకాశం ఉండనుంది. ఈ కొత్త బంతి కొత్త రూల్ తో ఐపీఎల్ లో బౌలర్స్ ఎంత నష్టపోతారో, బ్యాట్స్ మెన్ లు ఎంత వరకు లాభపడుతారో చూడాల్సిందే.