IPL 2021: మరో 10 రోజుల్లో ఐపీఎల్ రీషెడ్యూల్? బీసీసీఐ ముందున్న ఆప్షన్లేంటి?
IPL 2021: ఐపీఎల్ నిర్వహించాలంటే బీసీసీఐ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం
IPL 2021: ఐపీఎల్-14 సీజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహిస్తామన్న బీసీసీఐ... కరోనా కేసులు వెలుగు చూడడంతో.. ఎట్టకేలకు ఐపీఎల్ ను నిరవదిక వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై క్లారిటీ అయితే లేదు. కాగా, మరో 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈమేరకు మంగళవారం జరిగిన బీసీసీఐ గవర్నింగ్ సమావేశంలో ఈ విషయంపై చర్చించారని తెలుస్తోంది. కరోనా బారిన పడ్డ క్రికెటర్లకు అప్పటితో క్వారంటైన్ పూర్తికానుందని, అప్పుడే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బీసీసీఐ ముందున్న ఆప్షన్లేంటి
ఐపీఎల్ నిర్వహించాలంటే బీసీసీఐ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఒకే వేదికపై మ్యాచ్‌లను నిర్వహించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అదికూడా ముంబై వేదికగా ఐపీఎల్ ను నిర్వహించేలా ప్లాన్ చేయనున్నట్లు టాక్. దీంతో ఒకే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ముంబైలోని స్టేడియాలకు సమీపంలో ఉన్న హోటళ్లతో సంప‍్రదింపులు చేసినట్లు సమాచారం. ముంబై నగరం ఒకటే మూడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్న సిటీ కాబట్టి ఇదే సరైనదిగా బీసీసీఐ యోచిస్తోందని తెలుస్తోంది.
జూన్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. దీంతో జూన్ లో అయితే ఎటువంటి సమస్యలు కూడా రావని తెలుస్తోంది. కాకపోతే, భారత్-న్యూజిలాండ్ టీంల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న జరగాల్సిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను వాయిదా వేయాలి. దీనిపై కూడా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఐసీసీని రిక్వెస్ట్ చేసి డబ్యూటీసీ ఫైనల్‌ను జూలై కు వాయిదా వేసేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.
ఇవి రెండూ సాధ్యం కాకపోతే అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌కు ముందే ఐపీఎల్ మిగతా సీజన్‌ను పూర్తి చేసే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ భారత్‌లో సాధ్యం కాకపోతే యూఏఈలో నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఏదేమైనా ఐపీఎల్ ను నిర్వహించాలనే ఆలోచనలోనే బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.