పరువు దక్కాలన్నా.. టీ20లకు ముందు ఆత్మవిశ్వాసం నిలవాలన్నా ఆస్ట్రేలియాతో రేపటి వన్డేలో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మొదటి రెండు వన్డేల్లో తుస్సుమన్న విరాట్ సేన మూడో వన్డేలో విజయం కోసం కసి మీద కనిపిస్తోంది.
మొదటి రెండు వన్డేల్లో బొక్కాబోర్లా పడిన టీమిండియా ఆసీస్‌తో మూడో ఫైట్‌కు సిద్ధం అవుతోంది. క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలన్నా టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో రెడీ అవ్వాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు తప్పనిసరి ! పసలేని బౌలింగ్ పేలవ ఫీల్డింగ్‌తో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్‌బెర్రా వేదికగా కంగారూ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విరాట్ సేన ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆసీస్ కసిమీద కనిపిస్తోంది.
మొదటి రెండు వన్డేల్లో భారత బౌలింగ్‌ను కంగారూ బ్యాట్స్‌మెన్ ఓ ఆటాడేసుకున్నారు. భారీ స్కోర్లు నమోదు చేశారు. ఐతే ఛేజింగ్‌లో భారత్ పర్వాలేదనిపించింది. మరీ చెత్తగా ఏమీ ఓడిపోలేదు. ఐతే బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం టీమిండియాను కలవరపెడుతున్నాయ్. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి సత్తాచాటలేకపోవడం ఫీల్డర్లు మైదానంలో చురుకుగా కదలలేకపోవడం దెబ్బతీస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ ఫాంలో ఉన్న ఆస్ట్రేలియాను మనోళ్లు కట్టడి చేస్తారా మళ్లీ చేతులెత్తేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
భారత బౌలర్లలో నవదీప్ సైని, స్పిన్నర్ చాహల్ చెత్త ప్రదర్శన చేస్తున్నారు. బుధవారం నాటి మ్యాచ్‌లో సైని స్థానంలో నటరాజన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐపీఎల్‌లో యార్కర్లతో అదరగొట్టిన నటరాజన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయ్. ఇక షమి, బుమ్రాలో ఒకరికి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. ఇక బుమ్రా బౌలింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ బ్యాట్‌తోనూ అద్భుతం అనిపించలేకపోతున్నాడు. మూడో వన్డేలో రాణిస్తేనే విమర్శలకు చెక్ పడే అవకాశాలు ఉన్నాయ్.
భీకరమైన ఫాంలో ఉన్న వార్నర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇది టీమిండియాకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. వార్నర్ స్థానంలో ఫించ్‌తో కలిసి లబుషేన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్.