IPL 2021: ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితేంటి..?
IPL 2021: ఆస్ట్రేలియాకు చెందిన కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది కూడా భారత్‌లోనే ఉండిపోయారు
IPL 2021: ఐపీఎల్ 14 సీజన్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా కేసులు టోర్నీలో వెలువడడంతో.. బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. దీంతో ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. ఇంకా చాలామంది ఆసీస్ క్రికెటర్లు ఇండియాలోనే ఉండిపోయారు. ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది కూడా భారత్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఏమిటనేది తెలియడంలేదు.
ఈ విషయంలో బీసీసీఐ ముందుగానే భరోసా ఇచ్చినా.. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి విమానరాకపోకలు నిలిపివేయడంతో అనిశ్చితి నెలకొంది. భారత్ నుంచి విమాన రాకపోకలను మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో స్వదేశం ఎలా వెళ్లాలో తెలియక ఆసీస్ ఆటగాళ్లు, సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఈ విషయంలో బీసీసీఐ హామీ ఇచ్చినా... ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం చేసేందేలేదంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించే పనిలో నిమగ్నమైందని తెలుస్తోంది.
కాగా, నిన్న కేకేఆర్, సీఎస్‌కే క్యాంపులో కరోనా కేసులు బయటపడగా.. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో కోవిడ్ కేసులు బయటపడ్డాయి. వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ.. ప్లేయర్స్ కరోనా బారిన పడుతుండటం గమనార్హం. దీంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఈ మేరకు నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.