రేపు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టైటిల్ పోరు.. అన్నివిభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఇరుజట్లు
* ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ ఫైట్ * రాత్రి 7 గంటలకు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్
ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. కప్పు నీదా, నాదా అంటూ రెండు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. రేపు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది.
ఈ రెండు టీమ్స్ కూడా సెమీ ఫైనల్‌లో బలమైన జట్లను ఓడించి ఫైనల్ చేరాయి. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సాధించని కివీస్ - ఆసీస్, తమ తొలి టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పేట్టు లేదు.
ఇక. ఇదిలా ఉంటే ఫైనల్లో తలపడనున్న ఇరు జట్లు పోటా పోటీగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్‌లలోనూ హిట్టర్స్ ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనబడుతోంది. దీంతో టైటిల్ ఎవరు గెలుస్తారా అనేది చెప్పడం కాస్త కష్ట సాధ్యంగానే మారింది.
న్యూజిలాండ్ టాపార్డన్ చాలా బలంగా కనిపిస్తోంది. నెంబర్ 6 వరకు అందరూ హార్డ్ హిట్టర్లే ఉన్నారు. గప్తిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా ఈ టోర్నీలో అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్‌సన్ తనదైన రోజున చెలరేగిపోతాడు. ఇక బౌలింగ్ అయితే టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు. వీరికి తోడు అడమ్ మిల్నే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. ఇష్ సోథి, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్ విభాగం బలాన్ని పెంచుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ న్యూజిలాండ్ కంటే చాలా బలంగా ఉంది. ఓపెనర్ల నుంచి లోయర్ మిడిల్ వరకు అందరూ బ్యాటుతో సత్తా చాటే వారే. డేవిడ్ వార్నర్, ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్‌ల రూపంలో చాలా లోతుగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. వీరిని పటాపంచలు చేయాలంటే కివీస్ బౌలర్లు కష్టపడక తప్పదు.
ఫించ్, స్మిత్, మ్యాక్సీలు సెమీస్‌లో విఫలమయ్యారు. అయితే వార్నర్ మంచి ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు బాగా కలసి వచ్చే అంశం. ఇదిలా ఉంటే ఆసీస్ బౌలింగ్ అంత చెప్పుకోదగినట్టు లేదు. మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ త్వరగా వికెట్లు తీయగలిగితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. అడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా, వికెట్లు పెద్దగా తీయలేకపోతున్నారు.