Unlock 3: అన్‌లాక్ 2.0లో భాగంగా అమలవుతున్న కోవిడ్-19 నియంత్రణలు జులై 31న ముగియనుండటంతో అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్ట్ నుంచి అమలవనున్న అన్‌లాక్ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప్రకటిస్తారని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు, మెట్రో సర్వీసులను తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లభించకున్నా ఆగస్ట్ 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. భౌతిక దూరం వంటి కఠిన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సినిమా థియేటర్లను అనుమతించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ హోంమంత్రిత్వ శాఖ ముందుంచింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ను సంప్రదించిన థియేటర్ యజమానులు, 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను అనుమతించాలని విజ్ఞప్తి.
ముందుగా 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ థియేటర్లను తెరవాలని మంత్రిత్వ శాఖ సూచన, కోవిడ్-19 కేసుల తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీ చేయవచ్చని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత వంటి కొన్ని నియంత్రణలు అన్‌లాక్ 3లోనూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ఇప్పటికే సంప్రదింపులు. ఈ అంశంపై తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లండించారు.