నిర్మాతలకు తమ పెట్టుబడిని రికవర్ చేసుకునేందుకు థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ మాత్రమే కాక కొత్తగా వచ్చి చేరింది డిజిటల్ రైట్స్. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి డిజిటల్ వెబ్సైట్లకు డిజిటల్ రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతలు మంచి ఆదాయం పొందుతున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో డిజిటల్ రైట్స్ పొందినవారు సినిమా విడుదలైన మూడు లేక నాలుగు వారాల లోపే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పైన అందుబాటులోకి తీసుకు వస్తుండడం వలన థియేట్రికల్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఇంట్లో కూర్చుని హెచ్డీ ప్రింట్ లో సినిమా చూసే అవకాశం ఉండగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి డబ్బులు పోసి సినిమా చూడడానికి ఇష్టపడటం లేదు.
ఈ నేపథ్యంలో చాలా మంది చిన్న సినిమాల నిర్మాతలు మాత్రమే కాక పెద్ద సినిమాల నిర్మాతలు కూడా నష్టపోతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చింది. సినిమా థియేట్రికల్ విడుదల కి మరియు సినిమాను డిజిటల్ ప్లాట్ ఫాం లో అందుబాటులోకి తీసుకువచ్చే తేదీకి విండో పీరియడ్ ని పెంచాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాతల మండలి ఒక సినిమా విడుదలైన తరువాత 8 వారాల తర్వాతే డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాలకు మాత్రమే కాక చిన్న సినిమాలకు కూడా లాభం వస్తుంది.