'బాహుబలి' సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 10 భారతీయ భాషల్లో విడుదల చేయనున్నామని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఇక ఇతర భాషలను పక్కన పెడితే హిందీలో ఈ సినిమాను ఎవరు విడుదల చేయనున్నారు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి' ని విడుదల చేసిన ధర్మ ప్రొడక్షన్స్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం వారు షాకింగ్ అమౌంట్ను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ నిర్మాతకు మాత్రం ఇప్పుడే ఏ భాష రైట్స్ ను అమ్మే ఆలోచన లేదట. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారు. డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. ఈ ఆరు నెలల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని దానయ్య ప్లాన్.