Rajinikanth: 'ఆ ప్రశ్న నన్ను అడొగద్దని చెప్పాగా'.. రజనీకాంత్‌ అసహనం

తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు.

Update: 2024-09-20 12:30 GMT

 Rajinikanth: 'ఆ ప్రశ్న నన్ను అడొగద్దని చెప్పాగా'.. రజనీకాంత్‌ అసహనం 

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రజనీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇకపై తాను రాజకీయాల్లోని రానని రజనీ ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు రజనీ. ఈ క్రమంలోనే జైలర్‌ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో వరుసగా ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలపై రజనీ స్పందించడం లేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాజకీయాల గురించి ఓ విలేకరి నుంచి ప్రశ్న ఎదురుకాగా రజనీ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.. ‘‘రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగవద్దు అని చెప్పానుగా’’ అని అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

తమిళ రాజకీయాల విషయానికొస్తే.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారని అధికార డీఎంకేలో కొంతకాలంగా జోరుగా ప్రచారం జరగుతోన్న విషయం తెలిసిందే. ఇదే వార్తపై ఇటీవల స్పందించిన ఉదయనిధి.. ‘ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం. ఆయన మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం’ అని తెలిపారు. ఉదయనిధి ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక రజనీకాంత్ కెరీర్‌పరంగా చూస్తే.. ప్రస్తుతం ఆయన ‘వేట్టయాన్‌’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ వంటి భారీ స్టార్‌లు నటిస్తున్నారు. ఇక లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ మూవీలో.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

Tags:    

Similar News