సౌత్ లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా నటి ప్రియమణి తనదైన ముద్ర వేసుకుంది. గత కొన్నాళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఈమె అప్పుడప్పుడు బుల్లి తెరపై మాత్రం కనిపిస్తోంది. తాజాగా ఒక మంచి పనికోసం నిధులు సేకరిస్తూ వార్తల్లోకెక్కింది ప్రియమణి. 'స్టే ఎట్ స్కూల్' అనే స్వచ్చంద సంస్థలో భాగస్వామి అయిన ప్రియమణి అమ్మాయిల చదువు కోసం తనవంతు కృషి చేస్తూ వస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని అమ్మాయిలకు 'స్టే ఎట్ స్కూల్' సంస్థ వారు ఆర్థిక సాయం చేసి మళ్లీ స్కూల్ లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలు తిరిగి పుస్తకం పట్టారు.
ఈ సంస్థలో భాగస్వామిగా ఫండ్స్ రైజ్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుంది ప్రియమణి. స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ కట్టించడం, అమ్మాయిలకు కావాల్సిన శానిటరీ సదుపాయాలను కల్పించడం లాంటి వాటిలో తమ వంతు సాయం చేస్తోంది ప్రియమణి. మే 19న 10కే రన్ నిర్వహించి 'స్టే ఎట్ స్కూల్' సంస్థ వారు ఫండ్స్ సేకరించనున్నారు. ఈ 10 కే రన్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి కనీస వసతులు లేని అమ్మాయిల చదువుకు మీ వంతు సాయం చేయండి అంటూ ప్రియమణి కోరుతోంది. ప్రియమణి ఇలా ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.