తెలుగులో కంటే తమిళనాట మీటూ ఉద్యమం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద పాప్యులర్ లిరిసిస్ట్ అయిన వైరముత్తు పై షాకింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధా రవి యూనియన్ నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు, ఆమె సభ్యత్వం క్యాన్సల్ చేస్తున్నట్లు తెలిపారు. దానికి కారణం ఆమె ఫీజు చెల్లించకపోవటం అని చెప్పుకొచ్చారు. అయితే శాశ్వత శభ్యత్వం ఉన్న తనను ఎలా తీసేసారు అని చిన్మయి ఆందోళన వ్యక్తం చేసింది.
దాంతో ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆమె పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ సమయంలో ఆమెపై ఉన్న నిషేదంను ఎత్తి వేస్తూ స్టే ఆర్డర్ విధించింది. డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో ఆమెపై ఉన్న నిషేదానికి స్టే విధించడంతో పాటు అసోషియేషన్ అధ్యక్షుడు అయిన రాధారవికి నోటీసులు జారీ చేయడంతో చిన్మయికి కొంత ఊరట లభించింది. చిన్మయి సభ్యత్వంను రద్దు చేయడానికి గల తగు కారణాలను వెళ్లడించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీ లోపు రాధారవి మద్రాస్ హైకోర్టుకు డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ తరపును సమాధానం చెప్పాల్సి ఉంటుంది.