రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి చుట్టూ తిరుగుతుందని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండు థియేట్రికల్ ట్రైలర్ లు
ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలని అనుకుంటున్న వర్మ మార్చి 29 ని విడుదల తేదీగా ప్రకటించారు కానీ ఈ సినిమా విడుదల పై చాలా అనుమానాలు రేకెత్తాయి.
అయితే తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ తో కూడా ఈ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండదని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదల తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే చిత్ర బృందం దానిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాంగోపాల్ వర్మ మరియు అగస్త్య మంజు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.