ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ తొలి చిత్రంపై వివాదం... ‘బ్యాన్ మహారాజ్, బ్యాన్ నెట్‌ఫ్లిక్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్

గుజరాత్ హైకోర్టు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయకుండా నిలిపివేసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నెట్ ఫ్లిక్స్ కు, యశ్ రాజ్ ఫిలింస్ సంస్థకు కోర్టు నోటీసులు జారీ చేసింది

Update: 2024-06-15 12:24 GMT

ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ తొలి చిత్రంపై వివాదం... ‘బ్యాన్ మహారాజ్, బ్యాన్ నెట్‌ఫ్లిక్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్

ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన మహరాజ్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ‘బ్యాన్ నెట్ ఫ్లిక్స్, బ్యాన్ మహరాజ్ సినిమా’ అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్లు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ కొందరు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా నిజానికి జూన్ 14న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం విడుదలను జూన్ 18 వరకు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, నెట్ ఫ్లిక్స్ కు, యశ్ రాజ్ ఫిలింస్ సంస్థకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

మహారాజ్ సినిమాపై వివాదం ఎందుకు?

మహరాజ్ సినిమాను థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచారం చేశారు. అయితే, సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు ఓ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయని, సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఓ వర్గం మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసేలా ఈ సినిమా పోస్టర్లున్నాయని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయవద్దని ఎక్స్ లో ట్వీట్ చేస్తున్నారు. ఒక వర్గానికి చెందిన వారిని నెగిటివ్ గా ఈ సినిమాలో చూపించారని ఆరోపిస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా మీద కూడ ఇలాంటి విమర్శలే వచ్చాయి.

అసలు మహరాజ్ సినిమాలో ఏముంది?

మహరాజ్ సినిమాను వాస్తవకథ ఆధారంగా రూపొందించారని సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. జాదునాథ్ జీ బ్రిజ్ తరంజీ మహరాజ్, కర్సందాస్ ముల్జీ మధ్య జరిగిన పోరాటం ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. 1862లో జరిగిన మహారాజ్ పరువు నష్టం కేసు చుట్టూ ఈ కథ నడుస్తుంది.

మహరాజ్ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం

మహరాజ్ సినిమా ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉందని... ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. సనాతన ధర్మాన్ని అగౌరవపరిస్తే సహించేది లేదని విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీ పీటీఐకి చెప్పారు. నెట్ ఫ్లిక్స్ లో హిందూ వ్యతిరేక వెబ్ సిరీస్ లు, సినిమాలు గతంలో కూడా ప్రసారమయ్యాయని.. యమన్ నైకోడి అనే నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సాధువులను తప్పుగా చిత్రీకరించి హిందువుల మనో భావాలను దెబ్బతీసి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే జునైద్ ఖాన్, యశ్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సంతోష్ పరాబ్ అనే నెటిజన్ చెప్పారు.

హిందూ సాధువులను కించపర్చేలా ఉన్న మహరాజ్ సినిమాను నిషేధాన్ని గీత దలాల్ అనే నెటిజన్ కోరారు. అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాలో కూడా సాధువులను గ్యాంగ్ స్టర్ గా చిత్రీకరిస్తూ శివుడిపై సన్నివేశాలు, అభ్యంతరకర డైలాగులున్నాయని ఆయన గుర్తు చేశారు.

గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో ఇదే రకంగా వివాదాలు ప్రారంభమయ్యాయి. సినిమాలను విడుదల చేయవద్దని కోర్టులను ఆశ్రయించారు. కోర్టుల అనుమతులతో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. కోర్టు సూచనల మేరకు కొన్ని సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, మహరాజ్ సినిమాపై ఈ నెల 18న గుజరాత్ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News