సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు ఎలా తీసుకువస్తున్నారంటే...

How NASA is bringing back Sunita Williams: సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను

Update: 2025-03-17 14:22 GMT

సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు ఎలా తీసుకువస్తున్నారంటే...

సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భారత కాలమాన ప్రకారం మార్చి 18 సాయంత్రం 5.57 గంటలకు భూమి మీద ల్యాండ్ అవుతారు. 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం కానున్నారని నాసా ప్రకటించింది. కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 నెలల నిరీక్షణకు కొన్ని గంటల్లో తెరపడనుంది. సునీతా విలియమ్స్‌ను ఎలా భూమి మీదకు తీసుకువస్తారు? అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? ఇలాంటి విషయాలను ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

అంతరిక్షానికి చేరిన ఫాల్కన్ 9 రాకెట్

సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ను తిరిగి రప్పించేందుకు క్రూ 10 మిషన్‌ను మార్చి 14న ప్రారంభించారు. తొలుత మార్చి 12న జరగాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. మార్చి 14న రాత్రి 7 గంటలకు ఈ మిషన్ ప్రారంభమైంది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి పాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అనే నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకున్నారు.

క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో తిరుగు ప్రయాణం

సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను భూమి మీదకు తీసుకువస్తారు. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 17 అర్థరాత్రి 12.45 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకొని కిందకు వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. ఇందులో నుంచి ఒక్కొక్క వ్యోమగామిని బయటకు తీసుకువస్తారు.

సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం ప్రత్యక్ష ప్రసారం

సునీతా విలియమ్స్ బృందం అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చే ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమాన ప్రకారం మార్చి 18 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10.45 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తీసుకువచ్చే మిషన్‌లో భాగంగా కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.

అంతరిక్షం నుంచి వచ్చే వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లు

అంతరిక్షంలో నెలల తరబడి ఉన్న వ్యోమగాములు భూమి మీదకు వచ్చినప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. నడవడానికి ఇబ్బందులు పడతారు. కంటిచూపు సరిగా ఉండదు. తల తిరుగుతుంది. అరికాళ్లపై మందంగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. అంటే చిన్న పిల్లల పాదాలుగా వీరి పాదాలుంటాయి. భూమిపై వీరు నడవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

సాధారణంగా భూమిపై నడిచే సమయంలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా మనిషి అరికాళ్లపై చర్మం మందంగా మారుతుంది. ఇక గట్టిగా ఉండే చర్మం మెత్తగా లేదా మృదువుగా మారే అవకాశం ఉంది. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు ఎలా నడిచేవారో అలా నడవాలంటే కొన్ని వారాలు లేదా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

ఆ సమయంలో నడవడం అసౌకర్యంగా, బాధగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా వ్యోమగాముల ఎముకలు దెబ్బతింటాయి. ఎంతకాలం అంతరిక్షంలో ఉంటే అంతగా ఎముకలు బలహీనమౌతాయి. కండరాలు క్షీణిస్తాయి. కార్డియోవాస్క్యులర్ స్ట్రెస్ ఏర్పడుతుంది. రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఐసోలేషన్‌తో మెంటల్ హెల్త్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

స్పేస్ ఎనీమియా ముప్పు

ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు స్పేస్ ఎనీమీయా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉంటే వారిలోని రక్తకణాలు క్షీణిస్తాయి. దీన్నే స్పేస్ ఎనీమియా అని అంటారు.

మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైతే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించడమే ఎక్కువగా ఉంటుంది. భూమిపై ఉండే మనిషిలో సెకనకు రెండు మిలియన్ల రక్తకణాల ఉత్పత్తి, క్షీణత ఉంటుంది.

అంతరిక్షంలో ఆరు నెలలు అంతకంటే ఎక్కువ రోజులుంటే అలాంటి వ్యోమగాముల శరీరంలో రక్తకణాల ఉత్పత్తి, క్షీణత సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని నేచర్ మెడిసెన్ లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. దీని కారణంగా శరీరానికి ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుంది. కాలక్రమంలో గుండె పనితీరు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉందని నాసా చెబుతోంది. వ్యోమగాములను వెంటనే నాసా తమ పరిధిలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు.

అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపిన సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిద్దరూ క్షేమంగా భూమి మీదకు రావాలని మనం కోరుకుందాం... వెల్‌కమ్ టూ సునీతా....

Tags:    

Similar News