పాకిస్థాన్‌లో అబూ ఖతల్ మర్డర్... నెక్ట్స్ టార్గెట్ 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయూద్?

Update: 2025-03-17 11:04 GMT

Hafiz saeed : పాకిస్థాన్‌లో అబూ ఖతల్ మర్డర్... నెక్ట్స్ టార్గెట్ 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయూద్?

పాకిస్థాన్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హత్య సంచలనం సృష్టించింది. జమ్మూకశ్మీర్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లష్కరే తొయిబా జరిపిన ఉగ్రవాద దాడుల్లో ఈ అబూ ఖతల్ కీలక సూత్రధారి. 2023 రాజౌరి ఎటాక్, 2024 రియాసి ఎటాక్, పూంచ్ ఎటాక్ సహా అనేక ఉగ్రాద దాడుల్లో భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ అబూ ఖతల్.

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అబూ ఖతల్ సమీప బంధువు. శనివారం రాత్రి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జీలం జిల్లాలోని మంగ్లా-జీలం రోడ్డులో ఖతల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆ సమయంలో ఖతల్ వెంట గార్డుగా ఉన్న గన్‌మేన్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు.

గుర్తుతెలియని వ్యక్తులు హఫీజ్ సయీద్ దగ్గరి అనుచరుడైన అబూ ఖతల్‌ను చేరుకుని హత్య చేసిన తీరు సంచలనం సృష్టించింది. ఇక నెక్ట్స్ టార్గెట్ హఫీజ్ సయీదేనా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ రక్షణలో ఉన్నాడు. అబూ ఖతల్ హత్యతో పాక్ ఆర్మీ ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయని విదేశీ వ్యవహారాల నిపుణులు రవీంద్ర సచ్‌దేవ అభిప్రాయపడ్డారు. అబూ ఖతల్‌కు పట్టిన గతే హఫీజ్ సయీద్‌కు కూడా పడుతుందన్నారు.

లష్కరే తొయిబాకు కోలుకోలేని దెబ్బ - రక్షణ రంగ నిపుణులు

పాకిస్థాన్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హత్య ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా రక్షణ రంగ నిపుణులు హేమంత్ మహజన్ తెలిపారు. ఇది లష్కరే తొయిబా నాయకత్వ లోటుకు కారణం అవుతుందన్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఆ సంస్థ చేపట్టే ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పడుతాయన్నారు. ఒకవేళ చనిపోయిన వారి స్థానంలోకి కొత్త వారు వచ్చినప్పటికీ... లష్కరే తొయిబా పనితీరులో కచ్చితంగా తేడా ఉంటుందన్నారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ హేమంత్ మహజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

లష్కరే తొయిబాలో ఉగ్రవాదుల ఏరివేతతో కొత్తవారు ఆ స్థానంలోకి రావడం తగ్గుతుందని హేమంత్ మహజన్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో హింసాత్మక చర్యలు కూడా తగ్గుముఖం పడుతాయన్నారు. అయితే, హేమంత్ మహజన్ చేసిన ఈ వ్యాఖ్యలను రక్షణ రంగానికే చెందిన మరో నిపుణులు ప్రఫుల్ భక్షి కొట్టిపారేశారు. హఫీజ్ సయీద్ లాంటి వారిని మరో 10 మందిని మట్టుబెట్టినా ఉగ్రవాదం అంతం అవదన్నారు. ఉగ్రవాదాన్ని అణిచేయడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రఫుల్ అభిప్రాయపడ్డారు.

అబూ ఖతల్ హత్య భారత్ చేయించిన హత్యగానే పాకిస్థాన్ భావిస్తున్నప్పటికీ, అదే నిజమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అబూ ఖతల్‌ను హత్య చేసిన వారిని ప్రస్తుతానికి గుర్తుతెలియని వ్యక్తులుగానే పరిగణిస్తున్నారు. 

Jaffar Express Train Hijack Explainer: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్ ఘటన వెనుక ఏం జరిగింది ? 

Full View

Tags:    

Similar News