ట్రంప్ సొంతమైన ట్రూత్ సోషల్‌లో చేరిన ప్రధాని మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే...
PM Modi joins Truth Social: ట్రూత్ సోషల్‌లో చేరిన సందర్భంగా అందులో మొదటి పోస్ట్ పెడుతూ ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని..
ట్రంప్ సొంతమైన ట్రూత్ సోషల్‌లో చేరిన ప్రధాని మోదీ
PM Modi joins Truth Social: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్రూత్ సోషల్ యాప్‌లో చేరారు. ఫేస్‌బుక్, ఎక్స్ తరహాలోనే ఇది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ట్రూత్ సోషల్ యజమానిగా ఉన్నారు. ట్రంప్ అనేక సందర్భాలలో తన నిర్ణయాలను, సంచలన ప్రకటనలను ఈ ట్రూత్ సోషల్ ద్వారానే షేర్ చేసుకుంటూ వస్తున్నారు.
ట్రూత్ సోషల్‌లో చేరిన సందర్భంగా అందులో మొదటి పోస్ట్ పెడుతూ ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రూత్ సోషల్‌లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో అర్థవంతమైన చర్చలకు ట్రూత్ సోషల్ వేదికగా నిలుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. అనేక మంది ట్రూత్ సోషల్ యూజర్స్ కామెంట్స్ రూపంలో మోదీకి స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ ఆదివారం అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, ఫేమస్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ వీడియోను డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా అందులో ఉన్న నెటిజెన్స్ తో పంచుకున్నారు. అదొక పెద్ద వార్తగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాతే ప్రధాని మోదీ ట్రూత్ సోషల్ లో ఖాతా తెరవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అంతేకాదు... ట్రంప్ తన వీడియో షేర్ చేసుకోవడంపై మోదీ కూడా స్పందించారు. థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రపంచ కోణంలో అనేక విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నానని బదులిచ్చారు.
ఇప్పటికే అనేక సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న దేశాధినేతగా ప్రధాని మోదీ చాలామంది దేశాధి నేతల కంటే ముందున్నారు. అనేక సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని బహిరంగా వేదికలపై చెప్పుకొచ్చారు. అలాంటి మోదీ తాజాగా ట్రూత్ సోషల్ లో ఖాతా తెరిచారు. అమెరికాలో ట్రూత్ సోషల్ ఉపయోగించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అందులోనూ భారత సంతతి మూలాలు ఉన్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
ఇప్పటికే ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధాని మోదీ ప్రపంచానికి చేరువయ్యారు. మరి ట్రూత్ సోషల్ ఖాతాతో కొత్తగా ఇంకేం జరగనుందో వేచిచూడాల్సిందేనని కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.