మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయపార్టీలు మహిళలకు కంటితుడుపుగా మాత్రమే సీట్లు కేటాయించాయి. మహిళల కంటే ఓట్లు తక్కువగా ఉన్న పురుష అభ్యర్థులకు మాత్రమే సింహభాగం సీట్లు కేటాయించి మహిళలకు తాము ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో చెప్పకనే చెప్పాయి.భారత దేశంలో మాత్రమే కాదు నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం మహిళల పట్ల రాజకీయ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరికొద్దిరోజుల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 500కు పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్ధులు కేవలం 35 మంది మాత్రమే అంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.
ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నా ఓట్లు ఉన్నంత స్థాయిలో సీట్లు కేటాయించకపోడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు కలసి కేవలం 35 మంది మహిళలకు మాత్రమే సీట్లిచ్చాయి. ఆ సీట్లలో ఎక్కువభాగం రిజర్వుడు నియోజకవర్గాలలో కేటాయించినవే కావడం మరో విశేషం.
మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీకి దిగిన టీడీపీ కేవలం19 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తే...ప్రతిపక్ష వైసీపీ మాత్రం 16 మంది మహిళా అభ్యర్థునులను ఎంపిక చేసింది. వైసీపీ అధినేత సొంతజిల్లా కడప, రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలలో మహిళలకు ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. ఇటు టీడీపీ, అటు వైసీపీ కనీసం ఒక్క మహిళకూ సీటు ఇవ్వలేకపోయాయి.
మహిళా ఓటర్లు అధికంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు SC స్థానంలో మాత్రమే..మూడుపార్టీల తరపున ముగ్గురు మహిళలు ఢీ కొనబోతున్నారు. టీడీపీ కి చెందిన వంగలపూడి అనిత, తొలిసారిగా ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టం పరీక్షించుకొంటున్నారు.గుంటూరు జిల్లాలో వైసీపీ మూడుస్థానాల నుంచి మహిళలను బరిలో నిలిపితే టీడీపీ కనీసం ఒక్క మహిళకైనా సీటు ఇవ్వలేకపోయింది. రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి టీడీపీ ముగ్గురు మహిళలను సమరంలో నిలిపింది. భూమా అఖిలప్రియ, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి పోటీలో నిలిచారు.
అయితే ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ తరపున ఒకే ఒక్క మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ చెరో ఇద్దరు మహిళలకు సీట్లు కేటాయించాయి.విశాఖజిల్లాలో వైసీపీ 2 సీట్లు, టీడీపీ ఒక సీటు మహిళలకు ఇచ్చాయి. కృష్ణాజిల్లాలో టీడీపీ ఇద్దరు మహిళలను ఎన్నికల బరిలో నిలిపింది. అనంతపురం జిల్లాలో వైసీపీ 2, టీడీపీ ఓ సీటు మహిళలకు కేటాయిస్తే...చిత్తూరు జిల్లాలో టీడీపీ 3, వైసీపీ 1 సీటు ఇచ్చాయి.అంతేకాదు..తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 3, వైసీపీ 2 సీట్లు మహిళలకు ఇచ్చాయి. విజయనగరం జిల్లాలోని విజయనగరం స్థానం నుంచి అదితి గజపతిరాజు టీడీపీ తరపున తొలిసారిగా ఎన్నికలబరిలో నిలిచారు.
టీడీపీ ఇద్దరు మహిళలకు, వైసీపీ ఒక్కరికి సీట్లు కేటాయించాయి.పశ్చిమగోదావరిలో టీడీపీ, వైసీపీ చెరో అభ్యర్థిని రంగంలోకి దించాయి. కొవ్వూరు ఎస్సీ స్థానంలో మాత్రమే ముగ్గురు మహిళా అభ్యర్థులు మూడుపార్టీల తరపున త్రిముఖ సమరంలో తలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కోటీ 94 లక్షలు మాత్రమే ఉన్న పురుషులకు 140 సీట్లు ఇస్తే పురుషుల కంటే 4 లక్షల ఓట్లు అధికంగా కలిగిన మహిళలకు రెండు ప్రధానపార్టీలు కేవలం 35 సీట్లు మాత్రమేఇవ్వడాన్ని మించిన రాజకీయ వివక్ష మరొకటి లేదని ప్రత్యేకంగా చెప్పాలా మరి.