2019 సార్వత్రిక ఎన్నికలలో గెలుపెవరిది? ఇప్పుడిదే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆ మూడు రాష్ట్రాలే కీలకం దేశ ప్రధాని పగ్గాలు చేపట్టడానికి అర్హత సంపాదించాలంటే ఆ మూడు రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలి..ఇంతకీ ఏవా మూడు రాష్ట్రాలు?
అధికారం సాధించాలంటే ఆ మూడు రాష్ట్రాలే కీలకం. ఢిల్లీ గద్దె నెక్కాలంటే ముందు ఈ మూడింట్లోనూ గెలవాలి. అవే యూపీ, బీహార్, మహారాష్ట్ర. దేశ ప్రధాని కావాలంటే ముందు యూపీని గెలవాలి. దాదాపు 80 ఎంపీ స్థానాలున్న యూపీ రాజకీయంగా బాగా చైతన్యవంతమైన రాష్ట్రం అందుకే ఢిల్లీ గద్దె నెక్కాలంటే ముందు యూపీని గెలవాలన్నది అందరూ చెప్పే మాట ఆ తర్వాత అత్యధిక సీట్లున్న రెండు రాష్ట్రాలు బీహార్, మహారాష్ట్ర. బీహార్ లో 40 , మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లున్నాయి ఈ మూడు కీలక రాష్ట్రాల సీట్లు కలిపితే మొత్తం 168 ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ 168 సీట్లలో మెజారిటీ సీట్లు గెలిచి ఉండాలి.అందుకే బీజేపీ ఈ మూడింటిలోనూ మిత్రులతో సర్దు బాట్లకు ప్రయత్నిస్తోంది.
ముందుగా యూపీ గురించి యూపీలో పోటీ బీజేపీకి యాసిడ్ టెస్ట్ లాంటిది. మునుపెన్నడూ కలవని ఎస్పీ, బీఎస్పీలు రెండూ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్నాయి. మహాకూటమికి నేతృత్వం వహించాలని తపన పడిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగక తప్పని స్థితి ఎదురైంది. దాంతో యూపీలో బహుముఖ పోటీ కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల కూటమి బీజేపికి పెద్ద సవాల్ విసురుతోంది. వీటిని ఓడించి సీట్లు సాధించడం కమలనాథుల ముందున్న అతిపెద్ద టాస్క్.. ఈ రెండూ ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు బీజేపి రాజకీయంగా లాభపడింది. కానీ శత్రువులిద్దరూ చేతులు కలపడం యూపీ రాజకీయాల తీరును మార్చేసింది. యూపీ లోక్ సభ ఉప ఎన్నికల్లో గోరఖ్ పూర్, ఫుల్పూర్, కైరానా స్థానాల్లో రెండింటిని ఎస్పీ గెలుచుకోగా, కైరానా సీటు ఆర్ఎల్డీ ఎగరేసుకుపోయింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ నియోజక వర్గంలోనే ఓటమి ఎదురు కావడంతో బిజెపి శ్రేణులు కంగు తిన్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ వేవ్ కారణంగా బీజేపి సొంతంగా 71 సీట్లు గెలిచింది. మిత్రపక్షాలు మరో రెండు సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ తమకు పట్టున్న ప్రాంతాలను మాత్రం నిలుపుకోగలిగాయి ఒంటరిగా బరిలోకి దిగిన బీఎస్పీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇది గతం కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కలిశాయి కాబట్టి బీజేపీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు..అఖిలేష్, మాయా చాలా తెలివిగా కాంగ్రెస్ ని కూడా దెబ్బ తీశారన్న టాక్ వినిపిస్తోంది. ఇక బీహార్ లో కూడా ఈసారి కొత్త సమీకరణలు ఏర్పడ్డాయి.. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ కాంగ్రెస్ తో కలసి మహా కూటమిని ఏర్పాటు చేసింది. చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపి22, LJP ఆరు, RLSP మూడు సీట్లు గెలిచాయి. జేడీయూ ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్ రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. ఈసారి మాత్రం బీజేపీ, జేడీయూ, LJPసీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. బీజేపీ,జేడీయూ చెరి17 సీట్లకు, లోక్ జనశక్తి ఆరు సీట్లకు పోటీ చేస్తున్నాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేసి 32 సీట్లు గెలుచుకున్న చరిత్ర ఉంది. అప్పట్లో లాలూ పార్టీ నాలుగు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.
కులాలు, వర్గాలు ఎక్కువ ప్రభావం చూపే బీహార్ ఎన్నికల్లో ఈసారి విజయం ఎవరిదో చూడాలి. ఎన్డీఏ, మహాకూటమి రెండింటిపైనా కులపరమైన ఓట్ల ప్రభావం పడనుంది, అగ్రవర్ణాలు, వెనుకబడిన కులాలైన కుర్మీ, కోయిరి ఈసారి ఎన్డీఏ వైపుకు వెళ్లిపోగా, యాదవులు, మైనారిటీలు, దళితులు, మహా దళితులు మాత్రం మహా కూటమి వైపు న్నారు. ఇక బీహార్ జనాభాలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన24 శాతం ప్రజల ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి.
ఇక బీజేపీ గెలుపును ప్రభావితం చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. హిందూత్వ ఎజెండా భుజాన్న మోస్తున్న శివసేనతో వచ్చిన విభేదాలను సెటిల్ చేసుకోడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రెండూ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్, ఎన్సీపి కాంబినేషన్ కి చెక్ పెట్టొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో శివసేన కంగు తింది. మారిన సమీకరణల నేపధ్యంలో లోక్ సభ ఎన్నికలకు పొత్తుకు కొత్త షరతులు పెడుతోంది. సీఎం పదవిని తమకు కేటాయించాలని మరిన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అడుగుతోంది. మొత్తం 48 ఎంపీ సీట్లున్న మహారాష్ట్రలో 2014లో బీజేపి24, శివసేన20 సీట్లకు పోటీ పడ్డాయి. మోడీ వేవ్ కారణంగా బీజేపీ23 సీట్లు గెలవగా శివసేన 18 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో శివసేనతో ఉన్న విభేదాలను తొలగించుకుని కలసి పోటీకి దిగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేను కలిశారు కూడా.. బీజేపి ప్రయత్నాలకు దీటుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజ్ థాకరే నేతృత్వంలోని మహరాష్ట్ర నవ నిర్మాణ సేనతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు.. దాంతో మహారాష్ట్రలో బీజేపి దూకుడుకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది.