ఉద్దండుల కర్మభూమి కనౌజ్‌లో ఎన్నికల సమరం ఆసక్తిగా మారుతోంది. నాలుగో దశలో పోలింగ్ జరిగే బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీ కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్‌లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్ మరోసారి పోటీలో ఉండగా, ఉన్నావ్‌లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ బరిలోకి దిగారు.
ములాయం పోటీచేస్తున్న మైన్‌పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం కనౌజ్‌లోని పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందన్న అంచనాలున్నాయి. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్ జరిగే అవధ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నది విశ్లేషకుల అంచనా.
ఫరూఖాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్‌లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలున్నాయి. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు.
మాజీ సీఎం అఖిలేశ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ మూడోసారి కనౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట కనౌజ్ నియోజకవర్గం. ములాయం ఈ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందారు. 1967లో సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్‌తోపాటు ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్ ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు.
ఇక- ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్ సభ్యుడు సాక్షీ మహారాజ్‌కు ఉన్నావ్‌లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్‌శంకర్ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సాక్షి మహారాజ్ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్‌లో కిందటిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గంవారే. ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది.
ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ విజయాలు సాధించడం కష్టమేనన్న ప్రచారం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదన్న అంసతృప్తి ఉంది. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు.