పూతల...పట్టు ఎవరిదో?

Update: 2019-03-12 12:11 GMT

పూతలపట్టు నియోకజవర్గ నేతలకు సీట్ల గండంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని వుంది. పాతకాపులకంటే కొత్త అభ్యర్ధులే మేలని అధికార, ప్రతిపక్షపార్టీలు భావించడమే దీనికి కారణమని అంటున్నారు. ప్రతిసారీ ఓ కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతూ ఉండే పూతలపట్టు నియోజకవర్గంలోీ ఈసారి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.

సైబీరియా నుంచి వలసపక్షులు రావటం కొద్దివారాలు అతిథులుగా ఉండి ఆ తర్వాత పిల్లాపాపలతో ఎగిరిపోతూ ఉండటం ఓ పరంపరగా వస్తోంది. అయితే అదే సాంప్రదాయం పూతలపట్టు నియోజవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు సైతం వర్తిస్తుంది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ప్రతి సారీ ఓ కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతుంటారు. అయితే ఈ సారి మాత్రం ఇద్దరూ కొత్త అభ్యర్థులే పోటీలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునిల్ కుమార్ కు ఈ సారి టిక్కెట్ లేదని తేలిపోయింది. గత కొంత కాలంగా ఆయనకే టిక్కెట్టు వస్తుందన్న ఊహాగానాల నడుమ పోటీ కోసం గంపెడాసెతో ఉన్నప్పటికీ ఆయన ఆశలపై నీళ్ళు పార్టీ పెద్దలు నీళ్లు చల్లేశారు . దీంతో కొత్త వ్యక్తిని తెరమీదకు తెస్తున్నారు వైసిపి వారు.

మరోవైపు తెలుగుదేశం ఆశావహురాలు , రెండు పర్యాయాలు ఓటమిని చవి చూసిన టిడిపి ఇన్చార్జి లలిత కుమారికి సైతం ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. వెరసి రెండు ప్రధాన పార్టీలకు ఈ సారి కొత్త అభ్యర్థులే పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2008వ సంవత్సరంలో జరిగిన డీ -లిమిటేషన్ తో సరికొత్తగా ఏర్పడిన పూతలపట్టు నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఒక పర్యాయం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ రవి అప్పటి తెలుగుదేశం అభ్యర్థి లలితకుమారి పై విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాష్ర్ట విభజన దెబ్బతో కాంగ్రెస్ కుప్పకూలింది. దీంతో రవికి సైతం వైసిపిలో చోటు లేకుండా పోయింది. మరోవైపు టిడిపి లలిత కుమారినే బరిలోకి దించింది.

వైసిపి మాత్రం కొత్త వ్యక్తిని తెరమీదకు తెచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ సునీల్ కుమార్ వైసిపి నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజేతగా నిలిచారు. తెలుగుదేశం అభ్యర్ధి లలిత కుమారి వెయ్యికి లోపు ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వరుసగా రెండుసార్లు ఓడిన లలిత కుమారికి సైతం సీటు గండం తప్పలేదు.అంతేకాదు 2014 ఎన్నికల తరువాత రాష్ర్ట రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. జంప్ జిలానీలు పార్టీలు మారారు. ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలోకి వలసలు కట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి సునీల్ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వైసిపి నుంచి గెలుపొందిన అమరనాధరెడ్డి పార్టీ మారి మంత్రి పదవి సైతం కొట్టేశారు.అయితే సునీల్ కు అవకాశం దొరకలేదో..లేక భవిష్యత్తు ఉండదని వెళ్ళలేదోగానీ వైసిపిలోనే ఉండిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరారు. కానీ ఆయన ఆశలు ఆవిరైపోయాయి. చిత్తూరు రూరల్ మండలానికి చెందిన ఎఎస్ బాబును రంగంలోకి దింపాలని చూస్తోంది వైసిపి. ఈమేరకు అందుకు అవరసరమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. పార్టీ టిక్కెట్టు తెచ్చుకోవడానికి జరగాల్సిన లావాదేవీలు కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సునీల్ కూడా ఆశ వదులుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బాబును రంగంలోకి దింపుతున్నారు. బాబు ఆర్థికంగా బలవంతుడు మాత్రమే కాదు నియోజకవర్గ నేతలతోనూ పరిచయాలు బాగానే ఉన్నాయి. జిల్లా వైసిపిలో చక్రం తిప్పుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సీటు కన్ఫర్మ్ అయ్యిందని ప్రచారం సాగుతోంది.ఇక టిడిపిలోనూ ఇదే తరహా పితలాటకం మొదలైంది. రెండు పర్యాయాలు ఓడిపోయిన లలిత కుమారికి ఈ సారి టిక్కెట్టు డౌటేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్న చంద్రబాబు ఈ సారి కొత్త వ్యక్తినే బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవి టిడిపిలో చేరి టిక్కెట్టు ఆశిస్తున్నా ఆయన పట్ల సైతం పార్టీ అధినేత ఏమంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.

టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయమై ఇప్పటికే రెండుసార్లు చర్చలు,సమీక్షలు జరిపినా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. రెండు పార్టీలలో కొత్త ముఖాలు బరిలోకి దిగితే పాత కాపులు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆ మేరకు అటు పార్టీలు..ఇటు పాతకాపులు తమతమ ఏర్పాట్లలో తలమునకలైపోయారు. మొత్తం మీద పూతలపట్టుపై ఎన్నికలకు ముందు ఆ తర్వాత పట్టు ఎవరిదన్నది చర్చనీయాంశంగా మారింది. 

Similar News