వలసదారుల కలలకు ట్రంప్‌ కళ్లెం...ట్రంప్‌ చేతిలో లక్షమంది భవిత

Update: 2019-02-23 11:42 GMT

వలసదారుల అమెరికా కలలకు ట్రంప్‌ కళ్లెం వెస్తున్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారికి ఎండ్‌ కార్డ్‌ చూపేందుకు రెడీ అవుతున్నారు. హెచ్‌-4 వీసాతో అమెరికా వెళ్లిన వారిని ఇంటికి సాగనంపేందుకు ట్రంప్‌ సర్కార్‌ చట్టాలు సవరిస్తోంది. హెచ్‌4 వీసా రద్దు బిల్లు ఇప్పటికే వైట్‌హౌస్‌ చేరుకుంది. ట్రంప్‌ సంతకం చేయడమే తరువాయి లక్షలాది మంది పెట్టే బేడా సర్దుకొని స్వదేశాలకు తిరిగిరావాల్సిందే.

వలసదారులపై అమెరికాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తున్న ట్రంప్‌ సర్కార్‌ హెచ్‌-1బీ వీసాదారులను టార్గెట్‌ చేసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోడానికి వీలు లేకుండా చట్టాలను సవరిస్తోంది. హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల రద్దుకు అమెరికా ప్రతిపాదనలు రెడీ చేసింది.

హెచ్‌-1బీ వీసాదారులే కాకుండా, గ్రీన్‌కార్డుకోసం ఎదురుచూసే అనేకమంది టెకీలు, ఇతర ఉద్యోగుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాలు మంజూరు చేశారు. 2015లో బరాక్‌ ఒబామా హయాంలో తీసుకొచ్చిన ఈ వెసులుబాటు వల్ల అనేకమంది భారతీయులు లాభపడ్డారు. కానీ, ఇమ్మిగ్రేషన్‌ విధానంలో భారీ సంస్కరణలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌4వీసా వ్యవస్థను రద్దు చేసెయ్యాలని నిశ్చయించారు.

అమెరికా వలస, పౌరసత్వ సేవల విభాగం నాటి చట్టంలో మార్పులు చేసి హెచ్‌4వీసా వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రతిపాదనల ఫైల్‌ను వైట్‌హౌస్‌ బడ్జెట్‌ విభాగానికి పంపింది. ఈ ప్రతిపాదనలపై వైట్‌ హౌస్‌ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించి తుది ఫైలును అధ్యక్షుడికి పంపనుంది. ట్రంప్‌ సంతకం చేశాక నెలరోజుల వ్యవధిలో దీన్ని ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు. ఆ తరువాత వలసదారులపై ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

హెచ్‌4వీసా వ్యవస్థ రద్దును ఆమోదిస్తే దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారు. వారిక ఏ కంపెనీల్లోనూ పనిచేయడానికి వీలుపడదు. ఒకవేళ అక్కడ ఉండడానికి అనుమతి లభించినా కుటుంబంలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేసే వీలుంటుంది కాబట్టి ఆర్థిక కష్టాలు మొదలుకావొచ్చు. హెచ్‌4 వీసా రద్దుతో నష్టపోయే వారిలో అత్యధికులు భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ మార్పులను సవాలు చేస్తూ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలోని కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లో రెండు కేసులు దాఖలయ్యాయి. సిలికాన్‌ వ్యాలీలోని ఐటీ కంపెనీలు, కమలా హారిస్‌ లాంటి భారత్‌ అనుకూల వర్గాలు హెచ్‌-4 వీసా రద్దు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. కానీ ట్రంప్‌ మాత్రం హెచ్‌-4 వీసాల రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

Similar News