వరప్రసాద్ పొగడ్తల వెనక నిగూఢ అర్థాలు ఏమైనా ఉన్నాయా?

Update: 2019-07-19 04:12 GMT

ప్రశ్నిస్తాడనుకుంటే ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెడతారనుకుంటే, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్‌ అదిరిపోయింది, పద్దులు సూపర్‌ అంటూ చప్పట్లు కొడుతున్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే ప్రసంగంతో, అసెంబ్లీలో తెలుగుదేశం, బయట జనసేన కార్యకర్తలు కంగుతింటున్నారట. మరీ అంతగా ఎందుకు పొగుడుతున్నారంటూ ఆరా తీస్తున్నారట. పవన్‌ కల్యాణ్, నాదెండ్ల వంటి హేమాహేమీ నాయకులు ఓడిపోయినా, జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడుగా రాష్ట్రమంతా ఫోకస్ అయ్యారు. ప్రశ్నిస్తానంటూ ఆవిర్బవించిన పార్టీ నుంచి గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టిన రాపాక వరప్రసాద్, ప్రభుత్వాన్ని అన్ని విధాలా ప్రశ్నిస్తానని ప్రకటించారు. పార్టీ లైన్‌కు తగ్గట్టే ప్రజా సమస్యలపై ఎలుగెత్తుతానని, ఆ ఒరవడిలోనే వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం మోగిస్తామని అన్నారు. అయితే, అసెంబ్లీలో రాజోలు ఎమ్మెల్యే ప్రసంగాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై, విపక్షం కారాలు మిరియాలు నూరుతోంది. బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, ఉన్న కొద్దిమంది టీడీపీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. జనసేన కూడా విపక్షమే కాబట్టి, రాపాక వరప్రసాద్ తప్పొప్పులు ఎత్తిచూపుతారని, అందరూ సహజంగానే భావించారు. అయితే వైసీపీ బడ్జెట్‌ అద్బుతంగా ఉందంటూ, రాపాక వరప్రసాద్ ప్రశంసించడం, జనసేన కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమానమైన ప్రాధాన్యత చేస్తూ సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కొనియాడారు రాపాక. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా నడుస్తున్నారని వ్యాఖ్యానించారు.

రైతులు జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశారని మత్సకారులు కూడా జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని, వారు కోరుకోకుండానే వారికి వరాలు తీర్చే వ్యక్తిగా జగన్‌ను చూస్తున్నారని అన్నారు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. అయితే బడ్జెట్‌ బాగుందా లేదా అన్నది, ఎవరి దృష్టివారిదే. కానీ ఒకవైపేమో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సర్కారును తప్పొప్పులను ఎత్తిచూపిస్తామని అంటున్నారు. ఇటు అసెంబ్లీలో బడ్జెట్‌పై టీడీపీ ఘాటైన వ్యాఖ్యలు చేస్తోంది. జనసేన ఎమ్మెల్యే కూడా విపక్షంలా విమర్శిస్తారని అందరూ సహజంగానే అనుకున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు రాపాక వరప్రసాద్. ఇదే జనసేన కార్యకర్తలను కాస్త అసంతృప్తికి గురి చేస్తోందని ఆ పార్టీలో మాట్లాడుకుంటున్నారు.

తొలి అసెంబ్లీ సమావేశంలోనే వైసీపీ మీద ప్రశంసలు కురిపించారు రాపాక వరప్రసాద్. ఇప్పుడు బడ్జెట్‌ మీద కూడా పొగడ్తలతో ముంచెత్తడం, నిర్మాణాత్మక విమర్శలు చేయకపోవడం జనసేనకే కాదు, తెలుగుదేశం నేతలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. అయితే రాపాక వరప్రసాద్ మాత్రం, ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. తమ అధినేత పవన్‌ కల్యాణే, బడ్జెట్ బాగుందంటే, బాగుందని, బాలేదంటే బాలేదని చెప్పాలని, అన్నారని గుర్తు చేస్తున్నారు. విపక్షం కాబట్టి అదే పనిగా ప్రతి అంశాన్ని భూతద్దంలో చూస్తూ, తప్పుపట్టాల్సిన అవసరంలేదని పవన్ చెప్పారని అంటున్నారు. జనసేన పార్టీ లైన్‌ ప్రకారమే నడుచుకుంటున్నానని, దీన్ని కూడా తప్పుపడితే, తానేం చెయ్యలేనంటున్నారు రాపాక వరప్రసాద్. మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రభుత్వంపై వరుసబెట్టి ప్రశంసలు కురిపించడంపై ఆసక్తికమైన చర్చ జరుగుతోంది. వరప్రసాద్ పొగడ్తల వెనక నిగూఢమైన అర్థాలు ఏమైనా ఉన్నాయా లేదంటే తనకు తోచిందే మాట్లాడుతున్నారా అన్న విషయాలపై మాట్లాడుకుంటున్నారు జనసేన కార్యకర్తలు.

Full View 

Tags:    

Similar News