సినీ గ్లామర్ తో కాదు మంచితనంతో ఓట్లు కొల్లగొట్టాల నుకుంటున్నారు రంగీలా భామ ఊర్మిళ ఆకర్షణీయమైన రూపానికి తోడు, చక్కని హుందాతనంతో ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లకు చేరువవుతున్నారు. ముంబై నార్త్ లో ఈ భామ ప్రచార శైలి ఎలా ఉందో ఓ సారి చూద్దాం. రంగీలా ఫేమ్, బాలీవుడ్ బ్యూటీ ఊర్మిలా మతోంద్కర్ ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందున్నారు ఓటర్లకు చేరువవడానికి తన చరిష్మా, గ్లామర్ నే ఆయుధాలుగా చేసుకోడమే కాదు జనంతో మమేకవుతూ , వారిలో కలసిపోతూ ప్రచారం చేస్తున్నారు.
ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఊర్మిళఇప్పటికే సగం నియోజక వర్గం చుట్టేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి సహాయం తీసుకోకుండా కేవలం తన చరిష్మానే ఆమె నమ్ముకున్నారు. నియోజక వర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హుషారుగా దూసుకుపోతున్నారు. ఊర్మిళ ఓటర్లను కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్దగా హామీలు, వాగ్దానాలు కూడా ఏం చేయడం లేదు.సెక్యులరిజాన్ని నమ్ముతానంటున్న ఊర్మిళ రాజ్యంగ పరిరక్షణ,అందరికీ సమానత్వం, స్వేచ్ఛ కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్నారు.విద్వేష రాజకీయాలకు చెల్లు చీటీ చెప్పాలంటున్నారు.
ఓటర్లతో కలసి టీ తాగడం, పిచ్చా పాటీ మాట్లాడటం, మరాఠీ పండగలొచ్చినప్పుడు ఓటర్లతో కలసి డాన్సులు చేయడం లాంటి కిటుకులు ఫాలో అవుతూ ప్రచారంలో మైలేజ్ పెంచుకుంటున్నారు. మరాఠీ పండుగ గూడి పడ్వ ను ఊర్మిళ ఓటర్ల మధ్య ఉండే జరుపుకున్నారు. ఎక్కడైనా యువకులు, పిల్లలు కనిపిస్తే వారితో కలసి క్రికెట్ ఆడుతున్నారు.
ఓటర్లను కలుసుకునేందుకు, ఎన్నికల ప్రచారానికి వెడుతున్నప్పుడు తెల్లని కాటన్ చీరలు, సల్వార్ కమీజులు ధరిస్తూ..తక్కువ మేకప్ తో ఉంటున్నారు. కరచాలనం చేసేటప్పుడు ఓటర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గోళ్లు కూడా తీసేశారు. ఆదివారాలు కేవలం సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారితో కబుర్లు చెబుతున్నారు గ్లామర్ డాల్ లా కాకుండా ఓటర్ల మనసును చేరుకోవాలని ఉబలాటపడుతున్నారు.
నార్త్ ముంబై నుంచి 2004లో గోవిందా కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఊర్మిళా, గోవిందా కలసి రెండు, మూడు సినిమాల్లో నటించారు. గోవిందా ఎన్నికల ప్రచారంలో వెంట ఎప్పుడూ బాడీ గార్డులను ఉంచుకునేవారు.జనసామాన్యానికి దూరంగా మసలేవారు.. కానీ ఊర్మిళ మాత్రం జనంతో మమేకమవుతున్నారు. కానీ ఈ ప్రచారమే ఆమెకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ముంబై తీరప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన ఊర్మిళ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ ఇరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో భయపడిపోయారు.తన ప్రాణాలకు ప్రమాదముందంటూ బాంద్రా పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు.
బీజేపీ కార్యకర్తలు ఉద్దేశ పూర్వకంగా దాడికి దిగారని, భయపెట్టాలని చూస్తున్నారనీ అన్నారు.తాను గాంధీ,నెహ్రూ, పటేల్ లాంటి నేతలను అభిమానించే కుటుంబం నుంచి వచ్చానంటున్నారు ఊర్మిళ చిన్నప్పటినుంచి తనకు సంఘసేవపై ఆసక్తి ఉందన్నారు. ఈనెల 27న ఎన్నికలకు వెడుతున్న ముంబైలో ఊర్మిళ నియోజక వర్గం కూడా ఉంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఊర్మిళ రాజకీయాల్లో రాణిస్తారో లేదో చూడాలి.