అభినవ బసవణ్ణ ఆచరించిన మార్గం... మనకు ఆచరణీయం... ఎలా?
శివకుమార స్వామి అరమరికలు లేని, అసమానతలు లేని సమాజాన్ని ఆకాంక్షించారు. చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక భావనలతో ఎదిగిన శివకుమార స్వామి బాల్యం నుంచే భక్తిమార్గం పట్టారు.ఎనిమి దేళ్ల వయసునుంచే తల్లిదండ్రులతో కలసి తరచుగా పుణ్య క్షేత్రాలు సందర్శించేవారు. ధార్మిక కేంద్రాలు సందర్శించేవారు.. ఆయనకు ఇష్టమైన దైవం శివుడు.. శివగంగ ఆశ్రమానికి తరచుగా వచ్చి వెళ్లేవారు. ఆ ఆసక్తే ఆయనను కాలక్రమంలో ఈ ఆశ్రమాన్ని తీర్చి దిద్దే బాధ్యతలను కట్టబెట్టింది. ఫిజిక్స్ మేథమెటిక్స్ పాఠ్యాంశాలుగా బేచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో కూడా తరచుగా మఠానికి వచ్చి వెళ్లేవారు. కన్నడ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో పట్టున్న స్వామీజీ మఠంలో తన సన్నిహితుడు మరణం తర్వాత అనూహ్య పరిస్థితుల్లో మఠం బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. సమాజ సేవ పై మొదట్నుంచి ఆసక్తి ఉండటంతో 132 విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. నర్సరీనుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకూ ఆయన ఏర్పాటు చేసిన విద్యాసంస్థలెన్నో ఉన్నాయి. సంప్రదాయ సంస్కృత బోధనే కాదు.. ఆధునిక సైన్స్ టెక్నాలజీ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల ద్వారా పదివేలమంది పిల్లలకు ఉచిత విద్యాబోధన అందించారు.. ఇందులో కుల, మత, వర్ణ, వర్గ వివక్షకు తావే లేదు.
సిద్ధగంగ మఠం నిర్వహణ బాధ్యతలను కూడా ఎంతోచక్కగా నిర్వహించారు స్వామీజీ... మఠాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులకు మూడు పూట్లా ఉచితంగా భోజన సదుపాయం ఉంది. ఆశ్రమానికి వచ్చిన వారెవరూ అర్ధాకలితో వెళ్లే ప్రసక్తే లేదు.. భక్తులు ఎ ప్పుడొచ్చినా అక్షయపాత్రలా ఆహారం ఉంటుంది. మంత్రుల నుంచి దేశాధినేతల వరకూ మఠ సందర్శనకు వెడితే అక్కడ ఉచిత భోజనం చేశాకే వెనుదిరగాలి.మఠం నిర్వహణ ఖర్చులే నెలకు 30 లక్షలు అవుతాయి. స్వామి ఆధ్వర్యంలో ప్రతీ ఏటా వ్యవసాయ ఉత్సవం కూడా జరిగేది.. దీని ద్వారా రైతులు ప్రయోజనం పొందేవారు.కానీ స్వామీజీ అనారోగ్య కారణంగా ఇలాంటి కార్యకలాపాలన్నీ తగ్గిపోయాయి.తాను వందేళ్ల వయసుకు చేరుకోగానే సజీవ సమాధి కావాలని ఆయన ఆకాంక్షించారు. దానికోసం ఒక సమాధిని కూడా నిర్మించుకున్నారు.. కానీ భక్తుల ఒత్తిడితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే కన్నడ రాజకీయంపై సిద్ధగంగ మఠం ప్రభావం కూడా ఉంటుందని చెప్పుకుంటారు. సీఎం పీఠం ఎవరు ఎక్కాలన్నా. ఎవరు దిగాలన్నా.. వారికి సిద్ధగంగ మఠం ఆశీస్సులు ఉండాల్సిందేనని చెబుతారు. ఆధ్యాత్మిక బోధనలు వినడమే కాదు.. వాటిని చేతల్లో ఆచరించి చూపాలన్న పరమార్ధాన్ని బోధించిన వ్యక్తి శివకుమార స్వామి. సమాజానికి పట్టిన జాడ్యాలైన అసమానతలు, పేదరికం, ఆకలి చావులను ఆయన చాలా వరకూ నిర్మూలించారు. మానవ సేవే మాధవ సేవ అని చాటిన ఈ నడిచే దైవానికి భారత రత్న ఇవ్వాలన్న కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రతిపాదన సరైనదే..
మరణం మనిషిని భౌతికంగా మాత్రమే దూరం చేస్తుంది.. కానీ మనం చూపిన బాట, ఆచరించిన నీతి, చేసిన సేవ మాత్రం ఎల్లకాలం నిలిచిపోతాయి. స్వామీజీలు రాజకీయాల లంపటంలో చిక్కుకుంటున్న వేళ..అవినీతి, అరాచకాలు, అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మంచి సమాజం కోసం తన జీవిత కాలం క్రుషి చేసిన ఈ నడిచే దైవానికి మనందరం ప్రణమిల్లాలి.