వైసీపీలో అసంతృప్తితో ఉన్న వాణి కోసం బీజేపీ ప్రయత్నాలు?

Update: 2019-07-19 06:18 GMT

పెద్దాపురం ఏలేస్తామన్నారు. సైకిల్‌ను తొక్కేస్తామన్నారు. ఫ్యాన్‌ను ఊపేస్తామన్నారు. సీటు ఏదైనా విక్టరీ బీటు తమదేనన్నారు. కానీ వికసించలేపోయారు తోట దంపతులు. అందుకే మరో తోటలో కొత్తగా మొలకెత్తేందుకు నారునీరు సిద్దం చేసుకుంటున్నారన్న వార్త, దావానంలా వ్యాపిస్తోంది. స్వయంగా వైసీపీ అధినేత రంగంలోకి దిగి హామీ ఇచ్చినా, అలకపాన్పు దిగలేదని అంతా అనుకుంటున్నారు. మరి ఏ తోటలో వికసించాలని తోట కపుల్స్‌ సిద్దమవుతున్నారు?

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లా అంతటా పెద్దాపురం వైసీపీలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రేగుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు, తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరి, పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తోట వాణి వైసీపీ అధిష్టానంపై అలిగారు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి కాకినాడ ఎంపీగా గెలిచిన తోట నర్సింహం, తన సతీమణి తోట వాణితో సహా వైసీపీలో చేరారు.

వాణి భర్త నరసింహం లోక్‌సభలో టీడీపీపీ నేతగా కూడా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంలో చోటుదొరక్క, అక్కడ అలిగి కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే మరో అభ్యర్థిగా దవులూరి దొరబాబును రంగంలోకి దించడంతో, అంతకుముందు నుంచి అభ్యర్థిత్వం పోరులో వున్న తోట సుబ్బారావునాయుడు రాయుడు అసంతృప్తితో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు.

దవులూరి దొరబాబును పక్కన పెట్టి వైసీపీ అధినేత జగన్, పెద్దాపురం టిక్కెట్‌ను తోట వాణికి కేటాయించారు. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతితో తోట వాణి పరాజయం పాలయ్యారు. తాజాగా ఆయన ఎన్నిక మీద హైకోర్టులోనూ వాణి కేసు దాఖలు చేశారు. ఓటమి చెందిన రోజు నుంచి వాణి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, తానే నియోజకవర్గ ఇన్‌ఛార్జినని, తనకు ఎమ్మెల్సీ వస్తుందనే ప్రచారం అంతర్గతంగా చేసుకుంటూ వచ్చారు. అలాగే నియోజకవర్గంలోని అధికారులంతా, ఆమెను కలిసి ఆశ్శీస్సులు తీసుకోవడం, తన వద్దకు అధికారులు రాకపోతే వార్నింగ్‌లు ఇవ్వడం వరకూ వాణి వాగ్ధాటి కొనసాగుతూ వస్తోంది. రేపోమాపో తనను అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటిస్తుందని భావించిన తోటవాణికి, షాకింగ్ లాంటి వార్త తెలిసింది.

ఇన్ఛార్జిగా తనను కాదని దవులూరి దొరబాబుకు ఇస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో జోరుగా జరుగుతోంది. దీంతో అలక, అసంతృప్తితో వున్న తోట వాణిని, తమ పార్టీలోకి తీసుకోవడానికి బిజేపీ పావులు కదిపింది. మాజీ ఎంపీ తోట నరసింహంకు మంచి మిత్రుడైన సుజనాచౌదరి ఈ అంశంపై అంతర్గత సంభాషణలు సాగించారు. ఆ నోటా ఈ నోటా తోటవాణి పార్టీ మారుతున్నారని, దవులూరి దొరబాబు ఇన్ఛార్జిగా నియమితులవుతున్నారని జిల్లా వైసీపీ వర్గాలలో ప్రచారం జోరందుకుంది. దీంతో వాణిని బుజ్జగించేందుకు డిప్యూటీ సిఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ నాని, మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి చర్చించారు.

సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కలిసేందుకు తోట కుటుంబానికి అపాయింట్‌మెంట్‌ ఇప్పించారు. ఈలోగా తాను పార్టీ మారుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, వైసీపీలోనే వుంటానని మీడియాకు వాట్సప్‌ మెసేజ్ పంపారు వాణి. మరి జగన్ ఎలాంటి హామి ఇచ్చారోనన్న చర్చ కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరపున పోటీచేసి, తాజా ఎన్నికల్లో టిక్కెట్ రాక తెలుగుదేశంలోకి వెళ్ళి, చినరాజప్పకు మద్దతిచ్చిన తోట సుబ్బారావు నాయుడు తిరిగి దేశానికి దూరమయ్యారు. వైసీపీలో తిరిగి చేరనున్నట్టు ఆయన సన్నిహితవర్గ నేతలు చెబుతున్నారు. వాణికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఇస్తే దవులూరి దొరబాబుకు ఏమిస్తారు...ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల్లో తెలుగుదేశం-ఎన్నికల ప్రచారానికి దూరంగా వుండి, ప్రత్యక్షంగానే తోట వాణికి మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అధికారికంగా వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల కోసం పార్టీలోకి వచ్చినా, టిక్కెట్ ఇస్తే తోట వాణి ఇప్పుడు భర్త నరసింహంతో కలిసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం, సిఎం జగన్ దృష్టికి రాగానే అంతగా స్పందించలేదని తెలిసింది. పార్టీ మీద ప్రభావం పడకుండా వుండేందుకే వాణిని బుజ్జగించేందుకు మంత్రులు వెళ్ళారు. వాణి పార్టీ మారకుండా వారించాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ మారేవారి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని, జగన్ నాయకులకు గర్తు చేశారనే వినికిడి. ఇప్పుడు బుజ్జగింపులు అసలు అవసరం లేదనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ తాజా పరిణిమాలతో సిఎం జగన్ తీసుకునే నిర్ణయం ఎలా వుంటుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Full View

Tags:    

Similar News