శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు. శివరాత్రి రోజు అర్పించడం, అభిషేకించడం వల్ల, సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం. మరి జాగారానికి ఎందుకంత ప్రాశస్త్యం. అసలు జాగారం ఎందుకు చేయాలి?
మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదంటారు. శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, అత్యంత పుణ్య ప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివాలయానికి వెళ్లి, శివ దర్శనం చేసుకోవాలి ఇది శివార్చన.
ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు చెబుతోంది.
మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమే జాగారం. ఇలా చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది.