శబరిమలే కాదు... అన్ని ఆలయాల్లోనే ఇదే ఆచారమా ఇక!!

Update: 2019-01-03 05:08 GMT

మహారాష్ట్రలోని శని శింగణాపూర్‌ ఆలయం. స్త్రీలకు అక్కడ దశాబ్దాలుగా ప్రవేశంలేదు. అయితే మహిళా సంఘాలు మాత్రం దీనిపై ఉద్యమించాయి. భూమాతా రణరాగిణి బ్రిగేడ్ అనే మహిళా సంఘం నాయకురాలు తృప్తి దేశాయ్, మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు. ఏప్రిల్ 1 2016న, బాంబే హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శని శింగణాపూర్‌లోకి మహిళల ప్రవేశంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గుడిలోకి మహిళల ప్రవేశాన్ని నిరోధించే చట్టమేదీ లేదని స్పష్టం చేసింది. దేవున్ని ఆరాధించడానికి ఎలాంటి లింగ వివక్షకూ తావులేదని వ్యాఖ్యానించింది. ఆలయాల్లోకి మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తే, అది సగటు పౌరుల ప్రాథమిక హక్కులను భంగపర్చడమేనని స్పష‌్టం చేసింది. దీంతో ఏప్రిల్ 2, 2016 శని శింగణాపూర్‌ గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించి, చరిత్ర సృష్టించారు. కానీ సంప్రదాయవాదులు మాత్రం, వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. శబరిమల తరహాలోనే శనిసింగణాపూర్‌ కూడా రణక్షేత్రమైంది. శనిసింగణాపూరే శబరిమల ఎంట్రీకి స్ఫూర్తిఅయ్యింది.

కేవలం కొన్ని హిందూ దేవాలయాలే కాదు, ముస్లింల ప్రార్థనాలయాల్లోనూ స్త్రీలకు ప్రవేశం లేదు. అయితే శనిసింగణాపూర్‌ స్ఫూర్తిగా ముస్లిం మహిళలు విజయం సాధించారు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి ప్రవేశాన్ని, పోరాడి మరీ సాధించుకున్నారు. ఐదేళ్ల న్యాయపోరాటం, ఆందోళనల తర్వాత 80మంది మహిళలు హజీ అలీ దర్గాలోనికి ప్రవేశించి, ప్రార్థనలు చేశారు. ముంబైలోని సయ్యద్ పీర్ హజీ అలీ షా బుకారీ దర్గాలోనికి మహిళల ప్రవేశానికి ద్వారాలు తెరిచింది న్యాయస్థానం తీర్పు. అయితే ముస్లిం సంఘాలు, పెద్దలు మాత్రం ఆచారాలనే సమర్థించుకున్నారు.

కనపడని సంప్రదాయాల సంకెళ్లపై మహిళాలోకం ఉద్యమిస్తోంది. కట్టుబాట్లతో కట్టేస్తే, ఊరుకోవడానికి సతీసహగమనం కాలంనాటి స్త్రీలంకాదంటోంది. తల్లిగర్భంలోంచి పుట్టిన దేవుని దగ్గరకే, స్త్రీకి ప్రవేశం లేకపోవడమేంటని ప్రశ్నిస్తోంది. ఆ హక్కులకు రెక్కలు తొడిగి శనిసింగణాపూర్‌లో, హజీ అలీ దర్గాలోకి ప్రవేశించింది నేటి ఆధునిక అతివ. శబరిమల ఆలయంలోకి కూడా ప్రవేశించి, చరిత్ర సృష్టించింది. కానీ మహిళల ప్రవేశాన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారున్నారు. స్వయంగా మహిళలే వ్యతిరేకించేవారున్నారు. కానీ సాంప్రదాయం-సమానత్వంపై చర్చ, ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టే వరకూ, కొనసాగుతూనే ఉంటుంది.

Similar News